
గణేశ్ ఉత్సవాలకు పటిష్ట భద్రత
నివేదిక ఆధారంగా చర్యలు
పహాడీషరీఫ్: అన్ని శాఖల అధికారులు సమన్వయంతో బాలాపూర్ గణేశ్ ఉత్సవాలకు ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా చూడాలని మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి పేర్కొన్నారు. మల్లాపూర్‌లో బుధవారం ఆమె అన్ని శాఖల అధికారులు, ఉత్సవ సమితి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసిద్ధిగాంచిన బాలాపూర్ వినాయక ఉత్సవాలకు ఏటా భక్తులు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో విచ్చేయడాన్ని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. బడంగ్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్, జల్‌పల్లి మున్సిపాలిటీ అధికారులు వినాయక నిమజ్జన రూట్‌లో రోడ్డుపై అడ్డంకులు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ శాఖ అధికారులు కూడా మండపంతో పాటు పరిసరాలలో సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్ శాఖ తరఫున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా నిమజ్జనం సందర్భంగా లడ్డూ వేలం పాట రోజున అన్ని శాఖల అధికారలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం మండపం నుంచి చాంద్రాయణగుట్ట రూట్‌లోని గుర్రం చెరువు కట్ట మైసమ్మ వరకు మార్గాన్ని పరిశీలించారు. సమావేశంలో అదనపు డీసీపీ సత్యనారాయణ, టీజీఎస్‌పీడీసీఎల్ మహేశ్వరం డీఈ గోపాలకృష్ణ, బాలాపూర్ తహసీల్దార్ ఇందిరాదేవి, బడంగ్‌పేట్, జల్‌పల్లి మున్సిపాలిటీల కమిషనర్లు సరస్వతి, బి.వెంకట్రామ్, మహేశ్వరం ఏసీపీ జానకీరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్, బాలాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎం.సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా వినాయక చవితి జరుపుకోవాలి: ఏసీపీ
యాచారం: వినాయక చవితి పర్వదినాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు నిర్వాహకులకు సూచించారు. యాచారంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో బుధవారం వినాయక మండపాల నిర్వాహకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ వేళ నిబంధనలు అతిక్రమిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. మండపాల వివరాలను పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేసుకోవాలన్నారు. డీజేలు పెట్టరాదని, ప్రజలకు ఇబ్బందులు కలిగించరాదని పేర్కొన్నారు. విగ్రహాలను ఏ ప్రాంతంలో నిమజ్జనం చేస్తున్నారో ముందే సమాచారం ఇవ్వాలన్నారు. సమావేశంలో ఎంపీడీఓ రాధారాణి, ఉప తహసీల్దార్ కీర్తిసాగర్, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ సీఐలు నందీశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ, ఎంపీఓ శ్రీలత, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
డీసీపీ సునీతారెడ్డి