
ఈసీ.. కబ్జా చేసి!
రైతుల ఆందోళన
ఆక్రమణలో ఈసీ వాగు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: వికారాబాద్ జిల్లా పూడూరు, పరిగి ప్రాంతాల్లో మొదలయ్యే ఈసీ వాగు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాలను తాకుతూ హిమాయత్‌సాగర్ జలాశయంలోకి చేరుతుంది. వాగు సహజ సిద్ధంగా చేవెళ్ల–షాబాద్, మొయినాబాద్–శంషాబాద్ మండలాల సరిహద్దుల నుంచి ప్రవహిస్తుంది. శంషాబాద్ మండలం మల్కారం వరకు వెడల్పుగా ఉన్న వాగు అక్కడి నుంచి తగ్గింది. వాగులో భారీగా వరదలు వచ్చినప్పుడు వెడల్పు తగ్గిన చోటు నుంచి ఉప్పొంగి ప్రవహించేది. వరద వచ్చినప్పుడు బయటకు వచ్చిన నీరు నాలుగైదు గంటల్లో తగ్గిపోయేది. శంషాబాద్ మండలం కేబీ దొడ్డి వద్ద అంచమడుగు అనే కాలువ ఉండేది. ఈసీ వాగులో వరద ఎక్కువగా వచ్చినప్పుడు కాలువలో నుంచి సైతం వరద నీరు వెళ్లేది. ప్రస్తుతం వాగు సహజ సిద్ధమైన ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. కేబీదొడ్డి వద్ద అంచమడుగు కాలువను రియల్ వ్యాపారులు పూర్తిగా కబ్జా చేశారు. కాలువకు ఇరువైపులా తమ పట్టాభూమి ఉండటంతో చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించారు. కాలువకు సైతం ఇరువైపులా కాంక్రీట్ వాల్ నిర్మించి పైనుంచి స్లాబ్ వేశారు. వాగులో వరద ఎక్కువ వచ్చినప్పుడు కాలువలోకి రాకుండా రిటర్నింగ్ వాల్ నిర్మించడంతో వరద నీరు మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ వైపు డైవర్ట్ అవుతోంది. అలా దారిమళ్లుతున్న వరదనీరు పంట పొలాలను ముంచెత్తుతోంది.
భారీ వరద రావడంతో..
మూడు రోజుల క్రితం ఈసీ వాగులో భారీ వరద రావడంతో కబ్జాదారుల బాగోతం బయట పడింది. వెంచర్ వెనుకభాగంలో నిర్మించిన రిటర్నింగ్ వాల్ పైనుంచి వరదనీరు వెంచర్‌లోకి చేరింది. అంచమడుగు కాలువలోకి రాకుండా అడ్డంగా మట్టికట్ట నిర్మించడంతో అది తెగిపోయి కేబీదొడ్డి వైపు భారీగా వరదనీరు వెళ్లింది. వెంచర్ అవతలివైపు ప్రహరీ అడ్డుగా ఉంటంతో పొలాల్లోనే నీళ్లు నిలిచిపోయాయి. కేబీదొడ్డి వద్ద గొర్రెల షెడ్డును ముంచేసింది. రిటర్నింగ్ వాల్‌కు తగిలి అమ్డాపూర్ వైపు డైవర్ట్ అయిన వరదనీరు ఓ ఫంక్షన్ హాల్లోకి వెళ్లింది. అంచమడుగు కాలువలోకి వెళ్లాల్సిన వరదంతా ఈసీ వాగు వంతెన కిందినుంచే వెళ్లాల్సి రావడంతో అంతనీరు ఒకేసారి వెళ్లలేక ఆ ప్రాంతమంతా చెరువులా మరింది. అమ్డాపూర్ వంతెన నుంచి వెంకటాపూర్ వంతెన వరకు ఆరు కిలోమీటర్ల దూరం దీని ప్రభావం పడింది. ఎప్పుడూ లేని విధంగా వెంకటాపూర్ వంతెనను తాకుతూ ప్రవహించింది. వాగుకు రెండు వైపులా పంటపొలాలు నీటమునిగాయి. మరోవైపు వరద తగ్గిన వెంటనే రియల్ వ్యాపారులు తెగిపోయిన మట్టికట్టను బుల్డోజర్లతో మట్టి నింపి పూడ్చేశారు.
భారీ వరదతో బయటపడిన నిజ స్వరూపం
కాలువను ఆక్రమించి చుట్టూ ప్రహరీ
వరద చేరకుండా రిటర్నింగ్ వాల్ నిర్మాణం
దారిమళ్లిన నీళ్లు.. వందల ఎకరాల్లో మునిగిన పంటలు
కాదేదీ కబ్జాలకు అనర్హం అన్నట్లు అక్రమార్కులకు చెరువులు, వాగులు, వంకలు, కుంటలు ఏదీ వదలడం లేదు. ఖాళీగా కనిపిస్తే చాలు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. ఇష్టారీతిన ‘రియల్’ వెంచర్లు చేస్తూ ‘సొమ్ము’ చేసుకుంటున్నారు. సహజ సిద్ధంగా ప్రవహించే వరదనీటికి అడ్డుగా ఏకంగా రిటర్నింగ్ వాల్ నిర్మించారు. తాజాగా కురిసిన వర్షాలతో వరద దారిమళ్లి పంటపొలాలను ముంచెత్తింది. ఉధృతి మరింత ఎక్కువ కావడంతో అడ్డుకట్టలను బద్ధలు కొట్టుకుని వెంచర్‌నే ముంచేసింది.
ఈసీ వాగులో భారీ వరద వచ్చి పంటపొలాలు నీట మునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేబీదొడ్డి వద్ద అంచముడుగు కాలువ చుట్టూ రిటర్నింగ్ వాల్ నిర్మించి భారీగా మట్టి నింపడంతో వరద అమ్డాపూర్ వైపు మళ్లి పంట పొలాలు మునుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే తరహాలో వరదలు వస్తే పంటభూములన్నీ కొట్టుకుపోతాయని వాపోతున్నారు.