
ప్రజా సంక్షేమమే ధ్యేయం
● మంత్రి సీతక్క
● పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
చేవెళ్ల: అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్ శాఖమంత్రి సీతక్క అన్నారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు మండలి చీఫ్‌విప్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముడిమ్యాల నుంచి మల్కాపూర్ గ్రామానికి రూ.3.35 కోట్లతో చేపట్టే బీటీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. చేవెళ్లలో రూ.1.30 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. ఈ సంద ర్భంగా మంత్రి మాటాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు అందించటమే లక్ష్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్టు చెప్పారు. ముడిమ్యాలలో మహిళలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు అందించి వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేలా దుకాణాలు పెట్టించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్‌బోర్డు సభ్యుడు చింపుల సత్యనారాయణరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్‌లు, నియోజకవర్గం నాయకులు, చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
విగ్రహ ప్రతిష్ఠ పూజలు
మండలంలోని తంగడపల్లిలో నూతనంగా నిర్మించిన అభయాంజనేయస్వామి ఆలయంలో కొనసాగుతున్న విగ్రహప్రతిష్ఠ పూజలకు శనివారం మంత్రి సీతక్క, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య హాజరయ్యారు.