మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం

Aug 17 2025 8:23 AM | Updated on Aug 17 2025 8:23 AM

మున్స

మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం

మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం రాహుల్‌ గాంధీకి మద్దతు తెలపాలి ఆమనగల్లు బంద్‌ వాయిదా సమస్యలపై నిరంతర పోరు

మొయినాబాద్‌: వార్డు కార్యాలయాల వద్ద జాతీయ జెండా ఎగురవేసే విషయంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఖాజా మొయిజుద్దీన్‌ వ్యవహరించిన తీరుపై కలెక్టర్‌ నారాయణరెడ్డి స్పందించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని శనివారం చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ను ఆదేశించారు. ఈ విషయమై వారు విచారించగా కొత్తగా ఏర్పడిన చేవెళ్ల, శంకర్‌పల్లి మున్సిపాలిటీ కార్యాలయాల్లోనే జాతీయ జెండా ఎగురవేసినట్లు తెలిసింది. వార్డు కార్యాలయాల్లో జెండా ఆవిష్కరణలో విషయంలో అక్కడి మున్సిపల్‌ కమిషనర్లు ప్రజలతో సమయస్ఫూర్తితో సానుకూలంగా మాట్లాడారని, మొయినాబాద్‌ కమిషనర్‌ ఖాజా మొయిజుద్దీన్‌ మాత్రం స్థానికులతో దురుసుగా మాట్లాడటం వివాదంగా మారినట్లు గుర్తించారు. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు నివేదించినట్లు సమాచారం. ఈ విషయంలో కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

శంకర్‌పల్లి: ఓటు చోరీపై రాహుల్‌ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతు తెలపాలని కాంగ్రెస్‌ నేతలు పిలుపునిచ్చారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు శనివారం పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కార్యక్రమానికి పార్టీ జిల్లా ఇన్‌చార్జి ఇంద్రసేనారెడ్డి, అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మహిళా అధ్యక్షురాలు జ్యోతి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని దుర్వినియోగం చేయడం అన్యాయమని అన్నారు. దీనిపై వెంటనే న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో పార్లమెంట్‌ ఇన్‌చార్జి రామ్మోహన్‌, నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్‌, నాయకులు గౌరీ సతీశ్‌, వెంకటయ్య, చెన్నయ్య, నర్సింలు, శ్రీకాంత్‌ రెడ్డి, రమ్య, ప్రవీణ్‌, శ్రీనాథ్‌ పాల్గొన్నారు.

ఆమనగల్లు: మార్వాడీ వ్యాపారసంస్థలకు వ్యతిరేకంగా పట్టణంలో వివిధ వర్తక, వాణిజ్య సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 18న నిర్వహించ తలపెట్టిన బంద్‌ తాత్కాలికంగా వాయిదాపడింది. మార్వాడి గో బ్యాక్‌ అంటూ వర్తకులు ఇచ్చిన పిలుపు, మార్వాడీ వ్యాపారస్తులకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన ఒకరోజు బంద్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్వాడీలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పలుచోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పట్టణంలో బంద్‌కు పిలుపునివ్వడం చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో బంద్‌పై మార్వాడీ వ్యాపారస్తులు, స్థానిక వర్తకసంఘం నాయకుల మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. స్థానిక వ్యాపారుల డిమాండ్లకు మార్వాడీలు అంగీకరించినట్టు సమాచారం. మరోవైపు స్థానిక వర్తకసంఘం నాయకులను పోలీసులు పిలిపించి మాట్లాడారని, ఈ నేపథ్యంలో 18న తలపెట్టిన బంద్‌ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

తాండూరు: ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం తాండూరులో నిర్వహించిన పార్టీ జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీతో స్నేహం కొనసాగుతుంద న్నారు. అయినా ప్రభుత్వ తప్పులను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నామని పేర్కొన్నారు. ప్రజల ఆకలి బాధలు తీర్చేందుకు నిరంతరం పని చేస్తామన్నారు. ఆపరేషన్‌ కగార్‌ను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే ప్రతి ఒక్కరూ కమ్యూనిస్టులేనని అన్నారు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగంలో అంటరానితనం పోవాలనే నినాదంతో పోరాటం చేశామని తెలిపారు. పార్టీ అనుబఽంధ కార్మిక సంఘాల ద్వారా కార్మికుల పక్షాన తాము గళం వినిపిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సబ్‌ప్లాన్‌లను సక్రమంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. విద్యారంగ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పాలని ఆ సంఘం నాయకులు సాంబశివరావుకు వినతి పత్రం అందజేశారు.

మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం 1
1/1

మున్సిపల్‌ కమిషనర్‌పై విచారణకు ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement