హోర్డింగ్‌లపై హైడ్రా నజర్
మీర్‌పేట: శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కొన్నేళ్లుగా ఎలాంటి అనుమతులు పొందకుండా ఏర్పాటు చేస్తున్న వాణిజ్య ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్‌లపై హైడ్రా దృష్టి సారించింది. మీర్‌పేటతో పాటు చాలా వరకు మున్సిపాలిటీల్లో ఎలాంటి అనుమతులు పొందకుండా హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అడిగేవారు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసినా స్థానిక టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం పట్టించుకోకపోవడంతో హోర్డింగ్‌లు ఏర్పాటు చేసే సంస్థలు, భవనాల యజమానులకు కొంత కాలంగా లబ్ధి చేకూరుతోంది. ఈ క్రమంలో స్థానిక మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ విభాగంతో కలిసి హైడ్రా అక్రమ హోర్డింగ్‌లను గుర్తించి తొలగించే ప్రక్రియను ప్రారంభించింది.
యుద్ధ ప్రాతిపదికన తొలగింపు
మీర్‌పేట కార్పొరేషన్ పరిధి బాలాపూర్ చౌరస్తాలో రోడ్లకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఏ ఒక్క హోర్డింగ్‌కు అనుమతి లేకపోవడం గమనార్హం. అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రధాన రహదారి కావడంతో ఈ ప్రాంతంలో ప్రముఖ సంస్థల వ్యాపార ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్‌లు ఉన్నాయి. కార్పొరేషన్‌లో సగం కంటే ఎక్కువ హోర్డింగ్‌లకు అనుమతులు లేవని హైడ్రా అధికారులు గుర్తించారు. మున్సిపాలిటీల్లో ప్రభుత్వ అనుమతులు పొందకుండా ఏర్పాటు చేసుకున్న హోర్డింగ్‌లను యుద్ధ ప్రాతిపదికన తొలగించనున్నట్టు తెలిపారు. మీర్‌పేట ప్రాంతంలో హోర్డింగ్‌లతో పాటు బస్ షెల్టర్ల వద్ద నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పలు విద్యాసంస్థలు, ఇతర సంస్థల ఫ్లెక్సీలను సైతం తొలగిస్తున్నట్టు చెప్పారు.
మున్సిపాలిటీల్లో అనుమతులు లేకుండా ఏర్పాటు
ప్రభుత్వ ఆదాయానికి గండి
గుర్తించే పనిలో అధికారులు
తొలగింపు ప్రక్రియ షురూ
మరోవైపు కొత్తవి ఏర్పాటు
ఓవైపు హైడ్రా అధికారులు అనుమతులు లేని హోర్డింగ్‌లపై కొరడా ఝులిపిస్తుండగా, మరోవైపు అవేమీ పట్టించుకోకుండా కొత్తవి ఏర్పాటు చేస్తుండడం గమనార్హం. మున్సిపల్ కార్యాలయం వద్ద మీర్‌పేట కూడలిలో ఎలాంటి అనుమతులు పొందకుండా తాజాగా భారీ హోర్డింగ్‌లను ఏర్పాటు చేశారు. అక్రమ హోర్డింగ్‌లపై హైడ్రా చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కూడలిలో హోర్డింగ్‌లు ఏర్పాటు చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.


