పూరీ బాగుంది | Sakshi
Sakshi News home page

పూరీ బాగుంది

Published Tue, May 14 2024 3:35 PM

పూరీ బాగుంది

మొయినాబాద్‌రూరల్‌: లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సోమవారం హిమాయత్‌నగర్‌ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లోకి వెళ్లి యువకులను ఆప్యాయంగా పలకరించారు. ఇక్కడ ఏం స్పెషల్‌ అని అడుగగా యువకులంతా పూరీ స్పెషల్‌ సర్‌ అని చెప్పారు. వెంటనే నాకు కూడా పూరీ ఇవ్వండి అని ఆర్డర్‌ ఇచ్చి యువకులతో పాటు తిన్నారు. పూరీ బాగుంది అని హోటల్‌ సిబ్బందిని అభినందించారు.

1.50 కోట్ల మంది బస్సుల్లో ప్రయాణించారు

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌

గచ్చిబౌలి: తెలంగాణ వ్యాప్తంగా గడచిన గత రెండు రోజుల్లో 1.50 కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమతమ స్వగ్రామాలకు తరలివెళ్లారని తెలంగాణ ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి.సి.సజ్జనార్‌ తెలిపారు. కొండాపూర్‌లో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు 5 వేల టీఎస్‌ఆర్టీసీ బస్సులను నడిపామని వివరించారు. ప్రస్తుతం వర్కింగ్‌ డేస్‌ కావడంతో వెళ్లిన వారంతా ఓటు వేసిన తర్వాత తిరిగి అదే రోజు తిరుగు ప్రయాణంలో కూడా వారికి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. నగరంలోని ఉప్పల్‌, ఎల్‌బీనగర్‌, ఆరాంఘర్‌, సంతోష్‌నగర్‌, లింగంపల్లి ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచామన్నారు. ఆయా ప్రాంతాలలో ప్రయాణికులకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేలా అన్ని టెంట్లు ఏర్పాటు చేసి వసతి కల్పించామని ఎండీ వివరించారు. రెండు రోజులుగా డ్రైవర్లు, కండక్టర్లు, ఆఫీసర్లు, సిబ్బంది చాలా కష్టపడ్డారని తెలిపారు. వారందరినీ యాజమాన్యం పక్షాన, సంస్థ పక్షాన అభినందించాల్సిన అవసరం ఉందన్నారు. చాలా ఒత్తిడి ఉన్నా వారంతా ప్రయాణికుల శ్రేయస్సు కోసం చేసిన సేవలు మరువలేనివని వీసీ సజ్జనార్‌ కొనియాడారు.

అత్యధిక స్థానాల్లో

కాంగ్రెస్‌ విజయం తథ్యం

హైదరాబాద్‌: అత్యధిక లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్‌ పార్టీ కై వసం చేసుకుంటుందని ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, మాల మహానాడు జాతీయ ప్రధాన కార్యదర్శి సదానంద్‌ అన్నారు. ఓటర్లంతా కాంగ్రెస్‌ పక్షాన ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... ఓటింగ్‌ సరళి చూసిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి 12–14 స్థానాలు లభించే అవకాశం ఉందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసిన నేపథ్యంలో లబ్ధిపొందుతున్న ఓటర్లు కాంగ్రెస్‌ పార్టీకి అండగా నిలిచారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తెరవెనుక ఒప్పందాలు కుదుర్చుకోని కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా ఓటర్లు మాత్రం కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపారని ఆయన స్పష్టం చేశారు.

పోలింగ్‌ ఎందుకు తగ్గింది..?

వరుస సెలవులతో లక్షలాదిగా సొంత ఊళ్లకు తరలిన జనం

గ్రేటర్‌లో ఓటువేసేందుకు అనాసక్తి!

సాక్షి, సిటీబ్యూరో: ఎండలు నిప్పులు చెరగలేదు. వడగాలులు వీచలేదు. వడగండ్ల వానలు లేనేలేవు. సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నగర వాతావరణం చల్లగానే ఉంది. ఆహ్లాదంగానే ఉంది. కానీ పోలింగ్‌ మాత్రం మందకొడిగానే సాగింది. ప్రతి ఎన్నికల్లో నమోదైనట్లుగానే సాయంత్రం ఐదింటి వరకు 50 శాతం లోపే ఓట్లు పోలయ్యాయి. సాధారణంగా ఈసారి ఎండల కారణంగా సిటీలో ఓటింగ్‌ తగ్గవచ్చునని విశ్లేషకులు భావించారు. కానీ అందుకు భిన్నంగా వాతావరణం సహకరించింది. అయినప్పటికీ ఓటింగ్‌ ఆశించిన స్థాయిలో పెరగలేదు. నగరవాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలి వెళ్లడం వల్లనే ఈ సారి ఓటింగ్‌ శాతం తగ్గిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీలో లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండటంతో ఆ రాష్ట్రానికి చెందిన నగరవాసులు లక్షలాదిగా తరలి వెళ్లారు. నగరంలో ఓటింగ్‌ శాతం పెరగకపోవడానికి ఇది ప్రధాన కారణం. అదే సమయంలో తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన నగర వాసులు కూడా ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు పెద్ద సంఖ్యలోనే సొంత ఊళ్లకు వెళ్లారు. వేసవి సెలవుల కారణంగా చాలా మంది ఇంటిల్లిపాది కలిసి పర్యాటక ప్రాంతాలకు, సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. ఓటింగ్‌ తక్కువగా నమోదు కావడానికి వేసవి సెలవులు కూడా కారణమే.

Advertisement
 
Advertisement
 
Advertisement