మిగిలింది రెండు రోజులే | Sakshi
Sakshi News home page

మిగిలింది రెండు రోజులే

Published Mon, Nov 27 2023 7:10 AM

- - Sakshi

సభా ఏర్పాట్ల పరిశీలన

చేవెళ్ల: సీఎం పర్యటన నేపథ్యంలో చేవెళ్లలో ఏర్పాటు చేసిన సభా స్థలిని రాజేంద్రనగర్‌ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, అడిషనల్‌ డీసీపీ రష్మీపెరుమాళ్లు, చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి శనివారం పరిశీలించారు. వీఐపీ పార్కింగ్‌, సభకు వచ్చే ప్రజల పార్కింగ్‌, గ్యాలరీల ఏర్పాట్ల గురించి స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు. హెల్‌ప్యాడ్‌ నుంచి సీఎం సభా వేదికపైకి వచ్చే రూట్‌ మ్యాప్‌ను పరిశీలించారు. భద్రతపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. వారి వెంట చేవెళ్ల సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ ప్రదీప్‌కుమార్‌ ఉన్నారు.

సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల ప్రచారానికి ఇక రెండు రోజులే మిగిలింది. ఈ నెల 30న పోలింగ్‌ ప్రక్రియ నిర్వహించనున్నారు. అభ్యర్థులను గెలిపించుకునేందుకు ప్రధాన పార్టీల ముఖ్య నేతలు ఆయా నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇటీవల ఇబ్రహీంపట్నంలో పర్యటించిన సీఎం కేసీఆర్‌.. నాలుగు రోజుల క్రితం మహేశ్వరం నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో రోడోషోలు నిర్వహించారు. శనివారం తుక్కుగూడలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్పసభకు ప్రధాని నరేంద్రమోదీ హాజరయ్యారు. మహేశ్వరం, రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. అదే రోజు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఆమనగల్లులో పర్యటించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డిని గెలిపించాల్సిందిగా ఓటర్లను కోరారు. తాజాగా ఆదివారం ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ఆమనగల్లు, ఎల్బీనగర్‌లో పర్యటించారు. ఆయా నియోజకవర్గాల బీజేపీ అభ్యర్థులు ఆచారి, సామరంగారెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లపై విమర్శల వర్షం గుప్పించారు.

పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి

అభ్యర్థులు ఒకవైపు ముఖ్య నేతలతో భారీ బహిరంగసభలు, రోడ్‌షోలు ఏర్పాటు చేస్తూనే.. మరోవైపు పోల్‌ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. పోలింగ్‌ బూతుల వారిగా ఇన్‌చార్జిలను నియమించారు. ప్రతి వంద మంది ఓటర్లకు ఒకరు ఇన్‌చార్జిగా నియమించి, ప్రతి రోజు వారితో టచ్‌లో ఉండేలా ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాదు పార్టీల వారీగా కరపత్రాలను ముద్రించారు. పార్టీ గుర్తు, ఎన్నికల ఎజెండా, అభ్యర్థి ఫొటో సహా ఓటరు ఐడీ నంబర్‌, పోలింగ్‌ బూత్‌ నంబర్‌ను ప్రత్యేకంగా ముద్రించి ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. తమకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో మరికొంత మంది అభ్యర్థులు అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రచార గడువు ముగిసిన తర్వాత అభ్యర్థులు, ముఖ్య కార్యకర్తలపై మరింత నిఘా పెరిగే అవకాశం ఉండటంతో డివిజన్లు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా ఎంపిక చేసిన బాధ్యులు ఓటర్లకు పోలింగ్‌ స్లిప్పులతో పాటే నగదు, మద్యం బాటిళ్లు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం సీ విజిల్‌ యాప్‌నకు వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికం ఇలాంటివే ఉండటం గమనార్హం.

నేడు షాద్‌నగర్‌, చేవెళ్లలో ప్రజా ఆశీర్వాద సభలు

షాద్‌నగర్‌లో సోమవారం నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరుకానున్నారు. పట్టణంలోని మహబూబ్‌నగర్‌ రోడ్డులో ఉన్న యాగశాల మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహించే సభలో పార్టీ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ తరపున ప్రచారం చేయనున్నారు. అటు నుంచి నేరుగా చేవెళ్ల నియోజకవర్గానికి చేరుకొని మధ్యాహ్నం ఫరా కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కాలె యాదయ్య తరపున ప్రచారం చేయనున్నారు. సీఎం హాజరవుతున్న సభలకు జనాన్ని భారీగా తరలించేందుకు ఆయా నియోజకవర్గాల అభ్యర్థులు ఏర్పాట్లు చేశారు. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సభాస్థలిని పరిశీలించి, పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

తుది దశకు చేరుకున్న ప్రచారం

జిల్లాను చుట్టేస్తున్న ముఖ్య నేతలు

కల్వకుర్తి, ఎల్బీనగర్‌లో యోగి పర్యటన

నేడు షాద్‌నగర్‌, చేవెళ్లకు సీఎం కేసీఆర్‌ రాక

ఏర్పాట్లు పూర్తి చేసిన పార్టీ శ్రేణులు

చేవెళ్ల: ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధం చేస్తున్న వేదిక
1/1

చేవెళ్ల: ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాద సభకు సిద్ధం చేస్తున్న వేదిక

Advertisement
 
Advertisement