చేవెళ్ల: ఆలయ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని దేవాదాయశాఖ జిల్లా సహాయ కమిషనర్ ఎ.చంద్రశేఖర్ అన్నారు. చేవెళ్ల వేంకటేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి చేవెళ్ల పరిధిలోని మల్కాపూర్‌లో సర్వే నెంబర్లు 10 నుంచి 29, 31, 33, 127, 140, 141, 230 నుంచి 238, 273, 274, 275, 366లలో గల 77.30 ఎకరాల భూమిపై కోర్టులో కేసు కొనసాగింది. 2025 డిసెంబర్ 23న ఈ భూములు దేవాదాయశాఖకే చెందుతాయని హైకోర్టు తీర్పు వచ్చిందన్నారు. ఈ తీర్పు ప్రకారం మల్కాపూర్‌లో ఉన్న ఈ భూమిని సోమవారం దేవాదాయశాఖ అధికారులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు సర్వే చేసి పోలీసుల సమక్షంలో ఈ భూములలో బోర్డులు పాతారు. ఈ భూములను సాగు చేసుకుంటున్న గ్రామానికి చెందిన కొంత మంది రైతులకు దేవాదాయశాఖకు మధ్య ఏళ్ల తరబడిగా కేసు కొనసాగింది. ఇన్నాళ్లు రైతులు ఈ భూములు తమవే అంటూ సాగు చేసుకుంటూ వస్తుండటంతో కోర్టు తీర్పు ఆధారంగా ఈ భూ ములను దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుందని చెప్పారు. ఇక నుంచి ఈ భూములు దేవదాయశాఖ ఆధీనంలో ఉంటాయని వీటిపై ఎవరికి ఎలాంటి అధికారం లేదని చెప్పారు. ఈ బోర్డులను ఎవరైనా తీసినా భూఆక్రమనకు యత్నించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సర్వేలో దేవా దాయశాఖ ఈఓ టి.నరేందర్, పలు దేవాలయాల కార్యనిర్వహణ అధికారులు, చేవెళ్ల ఆలయ ధర్మకర్తలు దేవుని వామనాచార్యులు, పూజారులు అనంతచార్యులు శ్రీపాదు, చేవెళ్ల సీఐ భూపాల్‌శ్రీధర్, ఎస్‌ఐ తేజశ్రీ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ చంద్రమౌలి, అధికారులు, సిబ్బంది గ్రామస్తులు ఉన్నారు.
దేవాదాయ శాఖ జిల్లా సహాయ కమిషనర్ చంద్రశేఖర్


