అన్ని అనుమతులు ఉన్నప్పటికీ జయశంకర్ భూపాలపల్లి నుంచి మట్టిదుబ్బతో వచ్చిన లారీలకు ఈ ఏడాది జూలైలో రూ.2 లక్షల జరిమానా విధించారు. అది ఇసుక అంటూ జరిమానాలో పేర్కొన్నారు. అన్ని అనుమతులు ఉన్నాయని యజమాని మొత్తుకున్నా పోలీసులు చెవికెక్కించుకోలేదు. చేసేది లేక రూ.2లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అదే రోజు ఆ క్వారీ యజమాని న్యాయపోరాటం చేస్తానని ప్రతినబూనాడు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి పెద్దపల్లిలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కలెక్టర్ ఆదేశాలతో అధిక లెవీ చార్జీలు విధించి లారీ యజమానుల నడ్డి విరుస్తున్నారని ఫిర్యాదు చేశాడు. ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కార్యాలయం బాధితుడి ఫిర్యాదును సెంట్రల్ విజిలెన్స్‌కు పంపింది. ఈ విషయమై పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్షను వివరణ కోరేందుకు ప్రయత్నిచంగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.


