పసుపు సాగు.. జగిత్యాల జిల్లా రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపుతోంది. తరతరాలుగా సంప్రదాయంగా సాగు చేస్తున్న ఈ పంట నేడు వారి ఆర్థిక ప్రగతికి బాటలు వేస్తోంది. గ్రామాల్లోకి అడుగుపెట్టగానే రహదారుల వెంట పచ్చని పసుపు తోటలు స్వాగతం పలుకుతుండగా.. పంట దిగుబడులు, మార్కెట్‌లో లభిస్తున్న ధరలు రైతుల జీవన ప్రమాణాలను పెంచుతున్నాయి. పసుపు ఆదాయంతో అధునాతన ఇళ్లు నిర్మించుకోవడమే కాకుండా, తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి విదేశాలకు పంపిస్తున్న రైతు కుటుంబాలు జిల్లాలో కనిపిస్తున్నాయి. ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా 25,230 ఎకరాల్లో పసుపు సాగు కావడం ఈ పంటకు ఉన్న ప్రాధాన్యాన్ని చాటుతోంది.
జగిత్యాల అగ్రికల్చర్: ఉద్యానశాఖ అంచనాల ప్రకారం జిల్లాలో 25,230 ఎకరాల్లో పసుపు సాగైంది. గతేడాది క్వింటాల్‌కు రూ.19 వేల వరకు ధర పలకడంతో ఈసారి సాగు విస్తీర్ణం పెరిగింది. మెట్‌పల్లిలో అత్యధికంగా 4,196 ఎకరాలు, మల్లాపూర్‌లో 3,823, జగిత్యాల రూరల్‌లో 3,202, ఇబ్రహీంపట్నంలో 3,121, కోరుట్లలో 2,284, కథలాపూర్‌లో 2,054, రాయికల్‌లో 1,880, మేడిపల్లిలో 1,257 ఎకరాల్లో పంట సాగైంది.
తరతరాలుగా సాగు.. ప్రత్యేక పద్ధతులు
ధరలు ఎలా ఉన్నా జిల్లాలోని చాలా గ్రామాల్లో రైతులు పసుపు సాగును కొనసాగిస్తున్నారు. విత్తన దుంపలను సొంతంగా నిల్వ చేసుకుని తదుపరి ఏడాది సాగుకు వినియోగిస్తున్నారు. కోళ్ల ఎరువు, పశువుల పేడ, చెరువు మట్టిని ఉపయోగిస్తూ సేంద్రియ సాగు పద్ధతులకు ప్రాధాన్యమిస్తున్నారు. డ్రిప్ ద్వారా నీరు, అవసరమైన పోషకాలను అందిస్తున్నారు. దీంతో ఎకరాకు 25 నుంచి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి సాధిస్తున్నారు. ఒక్కో రైతు కనీసం 25 నుంచి 200 క్వింటాళ్ల వరకు పసుపు పండిస్తున్నారు.
ఇతర రాష్ట్రాల రైతులను ఆకర్షిస్తున్న తోటలు
జిల్లాలోని పసుపు తోటలను పరిశీలించేందుకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్రకు చెందిన రైతులతో పాటు ఉద్యాన పంటల నిపుణులు, అధికారులు వస్తుంటారు. ఎర్ర నేలలు పసుపు సాగుకు అనుకూలంగా ఉండటం, నాణ్యమైన దిగుబడులు రావడంతో ఇక్కడి పంటకు మంచి గుర్తింపు ఉంది. జగిత్యాల, మెట్‌పల్లి మార్కెట్లతో పాటు నిజామాబాద్, మహారాష్ట్రలోని సాంగ్లీ మార్కెట్లకు రైతులు పసుపును తరలిస్తున్నారు.
పసుపు ఆదాయంతో ఆర్థిక ప్రగతి
పసుపు పంట ద్వారా వచ్చే ఆదాయంతో రైతులు తమ కుటుంబాల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటున్నారు. గ్రామాల్లో సకల సౌకర్యాలతో ఇళ్లు నిర్మించుకోవడంతో పాటు పిల్లలను బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ వంటి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. కొందరు వారిని అమెరికా, లండన్, కెనడా వంటి దేశాలకు పంపిస్తున్నారు. ఇతర పంటల ఆదాయం వ్యవసాయ ఖర్చులకే సరిపోతుండగా.. పసుపు పంట ద్వారా వచ్చే ఆదాయం కుటుంబాల అభివృద్ధికి దోహదపడుతోందని రైతులు చెబుతున్నారు.
పసుపు పంటతో రైతుల బంగారు భవిష్యత్!
జగిత్యాల జిల్లాలో 25,230 ఎకరాల్లో పసుపు సాగు
రైతుల ఆర్థికాభివృద్ధికి అండగా నిలుస్తున్న వాణిజ్య పంట
పచ్చదనాన్ని సంతరించుకుంటున్న పల్లెలు
పంట ఆదాయంతో ఉన్నత చదువులు, విదేశీ బాట పడుతున్న పిల్లలు


