● రాజన్న ఆలయానికి కొత్త శోభ ● గోపురం కనిపించేలా రూపకల్పన ● ఆధ్యాత్మిక వైభవానికి కొత్త చిరునామా ● పురోగతిలో 14 అభివృద్ధి పనులు
వేములవాడ: వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. రూ.250 కోట్లతో చేపట్టిన పనుల్లో శ్రీస్వామివారి గోపురం కనిపించేలా స్లాబ్‌లు నిర్మిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం, ఆలయ ప్రాశస్త్యానికి తగినట్లుగా చేపట్టిన ఈ బహత్తర ప్రాజెక్ట్ పనులు దాదాపు 70శాతం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆలయానికి అనుబంధంగా ఉన్న ధర్మగుండాన్ని ఆహ్లాదకరమైన, పరిశుభ్రమైన వాతావరణం కల్పించేలా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ప్రాంగణంలో గ్రానైట్ ఫ్లోరింగ్, నిత్యాన్నదాన సత్రం, భక్తుల రద్దీకి అనుగుణంగా ఇతర సదుపాయాలపైనా దృష్టి సారించారు. రూ.35 కోట్లతో నిత్యాన్నదాన సత్రం పనులు సాగుతున్నాయి. తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి ఆలయం వరకు 80 ఫీట్ల రోడ్డు నిర్మాణం కొనసాగుతోంది. బద్దిపోచమ్మ ఆలయ అభివృద్ధి పనులు చివరి దశకు చేరాయి. ఆలయ గోపురం కనిపించేలా చేపడుతున్న నిర్మాణాలు, భారీ మండపాలు, ఆధునిక వసతులు రాజన్న క్షేత్రానికి కొత్త శోభను తీసుకురానున్నాయి. ఇటీవల కలెక్టర్ గరిమా అగ్రవాల్ క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి, వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. వీటీడీఏ అధికారులతో రాష్ట్ర దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్య, కమిషనర్ హన్మంతరావు నిరంతరం సమీక్షిస్తున్నారు.
పురోగతిలో 14 పనులు
తూర్పు గోపురం గ్రేడ్‌స్లాబ్ పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్ వరకు పనులు పురోగతిలో ఉన్నాయి. 11వ పొర రాతి పనులు జరుగుతున్నాయి. మహామండపం రూఫ్ స్లాబ్స్ పూర్తయ్యాయి. డ్రైన్ పనులు, గ్రేడ్ స్లాబ్ పీసీసీ పనులు పురోగతిలో ఉన్నాయి. నిత్య కల్యాణ మండపం ఇటుక, ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. వాలుగా ఉండే రూఫ్ స్లాబ్ షట్టరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి. కోటిలింగాల మండపం, బ్రాహ్మణ సత్రం, అద్దాలమండపం ఇటుక పని, ప్లాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. దేవ ధర్మగుండం అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయి. మహిషాసుర మర్ధిని స్లాబ్ పనులు పూర్తయ్యాయి. పశ్చిమ గోపురం గ్రేడ్ స్లాబ్ పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్ రూఫ్ స్లాబ్ వరకు కాలమ్స్ పనులు జరుగుతున్నాయి. నైరుతి ప్రాకార తోరణం రూఫ్ స్లాబ్ స్కాఫోల్డింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.


