● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ● రుద్రంగిలో రూ.7.07 కోట్లు, కోనరావుపేటలో రూ.కోటితో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రుద్రంగి/కోనరావుపేట(వేములవాడ): వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాలు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాల్లో బుధవారం ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివా స్, కలెక్టర్ గరిమా అగ్రవాల్‌తో కలిసి పర్యటించా రు. రుద్రంగి మెయిన్ రోడ్డు నుంచి కుక్కలగండి తండా వరకు రూ.4.57 కోట్లతో రోడ్డు పనులకు, రూ.2.50 కోట్లతో బీటీరోడ్డు, హైలెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కోనరావుపేట మండలం భూక్యరెడ్డి తండాలోని హనుమాన్ తండాలో రూ.కోటితో నిర్మించే సీసీరోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గంలోని గిరిజన తండాలకు రహదారి కనెక్టివిటీ కల్పించేందుకు సుమారు రూ.100 కోట్లు కేటాయించే దిశగా చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. తొలివిడతలో సుమారు రూ.40 కోట్లతో వివిధ గ్రామాలు, గిరిజన తండాల్లో రోడ్ల పనులకు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. టెండర్ల పూర్తయిన పనులను ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 కుటుంబాలకు ఒక్కోఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నామని, మరో 2,000 ఇళ్ల మంజూరుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. వేములవాడ అభివృద్ధిపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఆయన సూచనల మేరకు తండాలకు రహదారి సౌకర్యం కల్పించేలా నిధులు కేటాయిస్తూ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. తహసీల్దార్లు పుష్పలత, వరలక్ష్మి, సర్పంచ్‌లు గండి లక్ష్మి నారాయణ, బానోత్ నరేశ్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, సింగిల్‌విండో చైర్మన్ చేపూరి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.


