గింజ కొంటే ఒట్టు ! | - | Sakshi
Sakshi News home page

గింజ కొంటే ఒట్టు !

Nov 4 2026 11:46 PM | Updated on Nov 4 2026 11:46 PM

వంద కొనుగోలు కేంద్రాలు వెలవెల

సిండికేట్‌గా మారిన రైస్‌మిల్లర్లు

ఆరంభంలో ఆశపెట్టి.. ఇప్పుడు కోతపెట్టి

ధర తగ్గించి దండిగా కొనుగోళ్లు

సిరిసిల్ల: జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటి వరకు ఒక్క గింజను కూడా కొనుగోలు చేయలేదు. ప్రైవేట్‌ వ్యాపారులు పచ్చివడ్లనే కొంటుండడంతో రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తేవడం లేదు. అయితే మొదట్లో మురిపించిన మిల్లర్లు.. ఇప్పుడు అందరూ ఒక్కటై వడ్ల ధర తగ్గించేశారు. దసరా పండుగకు ముందు పంట చేతికొచ్చిన రైతులకు దండిగా డబ్బులు రాగా.. ఇప్పుడు పంట కోస్తున్న రైతులు కొంత నష్టపోతున్నారు.

1.47 లక్షల ఎకరాల్లో వరి

జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది వానాకాలంలో 1.47 లక్షల ఎకరాల్లో వరి సాగుచేశారు. దీని ప్రకారం జిల్లాలో 3.67 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అక్టోబరులో 55వేలు మెట్రిక్‌ టన్నులు, నవంబరులో 1.50 లక్షల మెట్రిక్‌ టన్నులు, డిసెంబరులో 1.60 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. ముందుగా వరినాట్లు వేసి పంట కోసిన రైతుల పంట పండింది. ఆరంభంలో మంచి ధర పెట్టిన రైస్‌మిల్లర్లు, వ్యాపారులు ఇప్పుడు భారీ ఎత్తున కోతలు పూర్తయి వడ్లు రైతుల చేతికి రావడంతో ఒక్కసారిగా ధరలు దించారు. మిల్లర్లు, వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలు తగ్గిస్తున్నారని రైతులు ఆందోళన చేశారు. సన్న పచ్చివడ్లకు ఇప్పుడు క్వింటాలుకు రూ.2,400 ధర ఉండగా.. మొన్నటి వరకు రూ.3,100 ఉండేది. దొడ్డు వడ్లు మొన్నటి వరకు క్వింటాలుకు రూ.2,400 ఉండగా.. ఇప్పుడు రూ.1,900లకు పడిపోయింది. వరి కోతలు మొదలైన ప్రారంభంలో ఊరించిన వ్యాపారులు ఇప్పుడు ధరలు దించి రైతులను ముంచుతున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లకు మద్దతు ధరను క్వింటాలుకు ‘ఏ’ గ్రేడ్‌కు రూ.2,461, కామన్‌ రకానికి రూ.2,441 నిర్ణయించింది. కానీ వడ్లను ఆరబెట్టి తేమశాతం 17 ఉంటేనే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొంటారు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తామని ఏడు రకాల వడ్లను ప్రభుత్వం గుర్తించింది.

‘ఇది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్‌లో అక్టోబరు 26న ఏఎంసీ చైర్మన్‌ మేడిపల్లి దేవానందం, స్థానిక సర్పంచ్‌ గీతాంజలి, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ నంది కిషన్‌లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ ఈ కేంద్రంలో ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. రైతులు పంట కోసి నేరుగా వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. దీంతో ఇక్కడ ప్రారంభించిన కొనుగోలు కేంద్రం వెలవెలబోతుంది.’

‘ఇది తంగళ్లపల్లి మండలం చిన్నలింగాపూర్‌. ఇక్కడ రైతులు పండించిన వడ్లను రైస్‌మిల్లర్లు, వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. పక్షం రోజులు కిందట సన్నవడ్లు పచ్చివి రూ.3100 క్వింటాలు కొనుగోలు చేయగా.. దొడ్డు వడ్లు పచ్చివి రూ.2400 కొనుగోలు చేశారు. ఇదే వ్యాపారులు ఇప్పుడు సన్న వడ్లను క్వింటాలుకు రూ.2400, దొడ్డు వడ్లను రూ.1900 కొనుగోలు చేస్తున్నారు. మార్కెట్‌లో వడ్లను డిమాండ్‌ ఉందని రైతులు ఆశిస్తుండగా.. రైస్‌మిల్లర్లు సిండికేట్‌గా మారి ధరలు తగ్గించారు.’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement