కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఈ ఏడాది కూడా పరీక్ష ఫీజును తానే చెల్లిస్తానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ నిర్ణయంతో 5 జిల్లాలకు చెందిన 10,959 మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. తెలంగాణ ప్రాంత ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘం(తపస్) కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు అన్నపునేని తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి జారతి నర్సయ్య 5 రోజుల క్రితం కేంద్ర మంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారని, గతేడాది మాదిరిగానే ఈసా రి కూడా ఫీజులు చెల్లించి ఆదుకోవాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన బండి సంజ య్.. తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్న విద్యార్థులందరి పరీక్ష ఫీజును చెల్లిస్తానని హామీ ఇ చ్చారు. ఈ మేరకు సంబంధిత జిల్లాల డీఈవోలకు సమాచారమందించారు. విద్యార్థుల ఫీజుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి రెండు, మూడు రోజుల్లో చెక్కు రూపంలో చెల్లించాలని నిర్ణయించారు. నియోజకవర్గ పరిధిలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 3,920 మంది, కరీంనగర్ జిల్లాలో 4,356 మంది, జగి త్యాల జిల్లాలో 1,087 మంది, సిద్దిపేట జిల్లాలో 1,133 మంది, హన్మకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పదోతరగతి చదువుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా బ్రాండెడ్ సైకిళ్లను పంపిణీ చేసిన బండి సంజయ్.. సీఎస్‌ఆర్ నిధులు, దాతల సహకారంతో పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పేద విద్యార్థులపై ఆర్థిక భారం తగ్గించే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు.


