తరచూ దొంగతనాలు, దాడులు భయానక వాతావరణం
ఈ ఫొటోలో కనిపిస్తున్నది ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లగొల్లపల్లిలో హత్యకు గురైన కాంట్రాక్టర్ మృతదేహాన్ని పరిశీలిస్తున్న పోలీసులు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మార్బుల్ కాంట్రాక్టర్, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌లకు చెందిన వలసకూలీలు రాచర్లగొల్లపల్లిలో అద్దె ఇంట్లో ఉండేవారు. వీరంతా కలిసి మార్బుల్ పనులు చేసే క్రమంలో వారి మధ్య మాటమాట పెరిగి ఇద్దరు కూలీలు కలిసి సదరు కాంట్రాక్టర్‌ను హత్య చేసి పరారయ్యారు. మరుసటి రోజే పోలీసులు వారిని వెంబడించి అరెస్ట్ చేశారు.
ఎల్లారెడ్డిపేట: జిల్లాలో ఆలయాలు.. శివారుకాలనీలోని ఇళ్లు లక్ష్యంగా ఇటీవల దొంగతనాలు పెరిగిపోయాయి. మత్తులో ఉంటున్న కొందరు వలసకూలీలు రచ్చరచ్చ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల కూలీల రాక పెరిగిపోవడంతో పల్లెల్లో రాత్రి వేళల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. వారి ఆగడాలతో జనం ఇబ్బంది పడుతున్నారు.
శివారు కాలనీల్లో కొత్తముఖాలు
జిల్లాలోని పలు మండల కేంద్రాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లు తాము చేయించే భవన నిర్మాణ పనుల కోసం ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరఖాండ్ రాష్ట్రాలకు చెందిన కూలీలను కాంట్రాక్ట్ మీద తీసుకొస్తున్నారు. వారంతా మద్యానికి బానిసైన వారు కావడంతో సాయంత్రం వేళ ఆయా ప్రాంతాల్లో అంత రచ్చరచ్చగా పరిస్థితులు మారిపోతున్నాయి. తాగిన మైకంలో వారిలో వారే దాడులు చేసుకుంటున్నారు. అవి హత్యలకు దారితీయడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
నిఘా కరువు
జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, తంగళ్లపల్లి, చందుర్తి మండలాల్లో పలువురు భవన నిర్మాణ పనులపై ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలను కాంట్రాక్ట్‌పై తీసుకొస్తున్నారు. ఆయా గ్రామాల్లోని శివారుకాలనీల్లో గదులు అద్దెకు తీసుకుని ఉంచుతున్నారు. వీరి వివరాలు కాంట్రాక్టర్లు, ఇంటి యజమానుల వద్ద ఉండడం లేదు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహించాల్సి వస్తుందో తెలియడం లేదు.
నిఘా పెట్టాం
ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న కూలీల సంఖ్య పెరిగింది. వారి వివరాలు కాంట్రాక్టర్ల వద్ద ఉంచుకోవాలి. ఇళ్లు అద్దెకు ఇచ్చే సమయంలో యజమానులు వలసకూలీల ఆధార్‌కార్డులు, ఇతర వివరాలు తెలుసుకోవాలి. ఈమేరకు కాంట్రాక్టర్లకు అవగాహన కల్పిస్తున్నాం. వలసకూలీలు, శివారు ప్రాంతాలపై నిఘా పెట్టాం.
– ఓదెల వెంకటేశ్, సీఐ, ఎల్లారెడ్డిపేట


