రుద్రంగి(వేములవాడ): ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలు సాగు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం రుద్రంగి మండలం మానాలలో నిర్వహించిన ఖేత్ బచావో అభియాన్, రైతు నేస్తం కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఎల్‌నినో నేపథ్యంలో భూగర్భజలాలు గతేడాదితో పోలిస్తే ఇంకా లోతులోకి పడిపోయాయని అన్నారు. రైతులు, ప్రజలు నీటిని పొదుపుగా వాడాలని సూచించారు. వరిసాగు చేస్తే నీరు భారీగా అవసరమని, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. మానాల రైతులు సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారని, గత సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటల సాగులో ముందున్నారని అభినందించారు. మానాల పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. చిన్నారులకు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం అందించాలని ఆదేశించారు. అనంతరం మానాలలో ఎకరం 20 గుంటల వ్యవసాయ భూమిలో ఉన్న కొద్ది పాటి నీటిని సద్వినియోగం చేసుకొని ఐదు రకాల పంటలు సాగు చేస్తున్న రైతు తూము గంగాధర్ పంట చేనును పరిశీలించి అభినందించారు. కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, మండల ప్రత్యేక అధికారి, జిల్లా ప్రణాళిక శాఖ అధికారి సంపత్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్ బాబు, రుద్రంగి తహసీల్దార్ పుష్పలత, తదితరులు పాల్గొన్నారు.
భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలి
సిరిసిల్ల: జిల్లాలో భూముల రీసర్వే ప్రక్రియలో వేగం పెంచాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్‌తో కలిసి భూముల రీసర్వే ప్రక్రియ పురోగతి, భూ భారతి దరఖాస్తులపై సమీక్షించారు. గ్రామాల సరిహద్దు సర్వే సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, రెవెన్యూ, అటవీ శాఖ, ఇతర ప్రభుత్వ శాఖలు సంయుక్తంగా చేపట్టాలని, భూములకు సంబంధించిన సమాచారం పక్కాగా సేకరించి, నమోదు చేయాలని అన్నారు. సంబంధిత జిల్లా అధికారి, డీఐలు, తహసీల్దార్లు భూముల రీసర్వే చేపడుతున్న గ్రామాలలో పర్యటించి, ప్రక్రియను క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని సూచించారు. సిరిసిల్ల ఆర్డీవో శ్రీధర్ బాబు, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్, తహసీల్దార్లు, డీఐలు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.


