పకడ్బందీగా భూ రీసర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా భూ రీసర్వే

Nov 4 2026 2:32 AM | Updated on Nov 4 2026 2:32 AM

చందుర్తి(వేములవాడ): భూ రీసర్వేలో లోపాలు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అన్నారు. చందుర్తి మండలం ఎన్గల్‌ గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే మంగళవారం తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భూముల సరిహద్దులు, విస్తీర్ణాల వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు నిబంధనల ప్రకారం పూర్తి చేయాలని సూచించారు. వీరి వెంట ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, తహశీల్దార్‌ భూపతి, సర్వేయర్‌లు ఉన్నారు.

ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దు

రుద్రంగి/చందుర్తి: జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం వహించొద్దని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఏంజెలా ఆల్ప్రెడ్‌ అన్నారు. మంగళవారం రుద్రంగి సబ్‌ సెంటర్‌, మానాల బడితండా ప్రభుత్వ ఆస్పత్రి, చందుర్తి పీహెచ్‌సీలను తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని రికార్డులు, రిజిస్టర్లు, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. క్షయవ్యాధి లక్షణాలున్న వారిని మందుగా గుర్తించి పరీక్షలు నిర్వహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను నిర్దేశించిన లక్ష్యాల మేరకు నాణ్యతతో అమలు చేయాలని తెలిపారు. చందుర్తి వైద్యాధికారి జీవన జ్యోతి, సంబంధిత వైద్య సిబ్బంది, ఇతర ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.

కుష్ఠు వ్యాధి గుర్తింపు సర్వే పరిశీలన

తంగళ్లపల్లి(సిరిసిల్ల): పకడ్బందీగా కుష్ఠువ్యాధి గుర్తింపు సర్వే నిర్వహించాలని రాష్ట్ర పరిశీలకులు డాక్టర్‌ లత అన్నారు. తంగళ్లపల్లి పీహెచ్‌సీ పరిధిలో నిర్వహిస్తున్న ఇంటింటి కుష్ఠువ్యాధి గుర్తింపు (ఎల్‌సీడీసీ) సర్వేను జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్‌ రాంరెడ్డితో కలిసి మంగళవారం పర్యవేక్షించారు. వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. సర్వేలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా ప్రతీ ఇంటిని సందర్శించి క్షుణ్ణంగా పరీక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. కుష్ఠు వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే అంగవైకల్యాన్ని పూర్తిగా నివారించవచ్చని అన్నారు. డీపీఎంవో దేవ్‌సింగ్‌, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు

కోనరావుపేట: అటవీ ప్రాంతాల్లోని వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్‌వో సత్యనారాయణ అన్నారు. మంగళవారం మండలంలోని నిమ్మపల్లి, కోనరావుపేట శివారు అటవీ ప్రాంతాల్లో నిర్మించే నీటి నిల్వ కుంటల ఏర్పాటు కోసం ప్రాంతాలను పరిశీలించారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా అటవీ ప్రాంతాల్లోని నీటి నిల్వలు తగ్గిపోతున్నాయని, అటవీ ప్రాంతాల్లో ఉండే వన్యప్రాణులు, పక్షులు, ఇతర జంతువులు నీటి కోసం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు. నీటి ఇబ్బందులను నివా రించేందుకు నిమ్మపల్లి బీట్‌ పరిధిలో నాలుగు నీటి నిల్వ కుంటలు, కోనరావుపేట బీట్‌ పరిధిలో మూడు నీటి నిల్వ కుంటలు నిర్మించతలపెట్టామని తెలిపారు. ఆయన వెంట ఎఫ్‌ఆర్వో షీతల్‌, ఎఫ్‌ఎస్‌వో బీర్బల్‌నాయక్‌, బీట్‌ అధికారి సుదర్శన్‌, బేస్‌క్యాంప్‌ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement