పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి | - | Sakshi
Sakshi News home page

పౌరులు బాధ్యతగా వ్యవహరించాలి

Oct 28 2026 12:24 AM | Updated on Oct 28 2026 12:24 AM

సిరిసిల్లటౌన్‌: బాలలపై జరుగుతున్న లైంగిక నేరాలను నివారిద్దామని, పౌరులు బాధ్యతగా వ్యవహరించాలని సిరిసిల్ల మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.సృజన పిలుపునిచ్చారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ సూచనలతో మంగళవారం సిరిసిల్ల జెడ్పీహెచ్‌ఎస్‌ (కుసుమ రామయ్య) బాలుర పాఠశాలలో నిర్వహించిన శ్రీసురక్షిత్‌ బచ్పన్‌ అభియాన్‌శ్రీ అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు దాచకుండా అధికారుల దృష్టికి తీసుకురావాలని, బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతూ వారికి మానసిక ధైర్యం అందించాలని సూచించారు. హెచ్‌ఎం ఎల్‌.మోతిలాల్‌, లోక్‌ అదాలత్‌ సభ్యులు సి.భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి

సిరిసిల్లఅర్బన్‌: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని జిల్లా విద్యాధికారి జె.విజయ్‌సాగర్‌ అన్నారు. మంగళవారం పట్టణంలోని రాజీవ్‌నగర్‌ మినీ స్టేడియంలో జిల్లాస్థాయి పీఎంశ్రీ స్కూల్‌ గేమ్స్‌ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యతను వెలికి తీయడానికి ఈ పోటీలు ఎంతగానో దోహదపడుతాయన్నారు. పోటీల్లో ఎంపిక చేసిన 10 హైస్కూళ్ల విద్యార్థులు పాల్గొన్నారు. వాలీబాల్‌లో జెడ్పీహెచ్‌ఎస్‌ రాచర్లబొప్పాపూర్‌ ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్‌ రుద్రంగి ద్వితీయ, ఖోఖోలో టీజీడబ్ల్యూఆర్‌ఎస్‌ బద్దెనపల్లి ప్రథమ, జెడ్పీహెచ్‌ఎస్‌ రాచర్ల బొప్పాపూర్‌ ద్వితీయ, కబడ్డీలో టీజీడబ్ల్యూఆర్‌ఎస్‌ బద్దెనపల్లి ప్రథమ, జీహెచ్‌ఎస్‌ వేములవాడ ద్వితీయ స్థానంలో నిలిచాయి. అథ్లెటిక్స్‌ పోటీల్లో పలువురు గెలుపొందారు. ఈ పోటీల్లో గెలుపొందినవారు రాష్ట్ర స్థాయిలో పాల్గొననున్నట్లు క్రీడలశాఖ అధికారి రాందాస్‌ తెలిపారు.

హెల్మెట్‌ ధారణపై అవగాహన

సిరిసిల్లఅర్బన్‌: పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా 17వ పోలీస్‌ బెటాలియన్‌ ఆధ్వర్యంలో హెల్మెట్‌ ధారణపై అవగాహన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ ఆదేశాల మేరకు సర్థాపూర్‌ నుంచి జెగ్గారావుపల్లె, పెద్దూరు మీదుగా కలెక్టరేట్‌ చౌరస్తా వరకు ర్యాలీ కొనసాగింది. ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్బెట్‌ ధరించాలని, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. అసిస్టెంట్‌ కమాండెంట్‌ ఎం.రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఎల్లమ్మ ఆలయానికి రూ.లక్ష విరాళం

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలకేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఎల్లమ్మ ఆలయానికి సింగిల్‌విండో చైర్మన్‌ గుండారపు కృష్ణారెడ్డి మంగళవారం రూ.1,00,016 విరాళం అందించారు. వచ్చే నెలలో ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్ఠతోపాటు సిద్ధోగం నిర్వహించనున్న నేపథ్యంలో గౌడ సంఘం సభ్యులు గడతో ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి–లహరి దంపతులు విరాళం అందించారు. గౌడ సంఘం నాయకులు చింతకింది కిషన్‌గౌడ్‌, నాగుల ప్రదీప్‌గౌడ్‌, గంట అంజాగౌడ్‌, నల్లమందు బాలయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement