సిరిసిల్ల: జిల్లాలో ఎల్‌నినో ప్రభావాన్ని సమష్టిగా అధిగమిద్దామని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. కలెక్టరేట్లో మంగళవారం జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ ఏడాది జిల్లాలో వర్షాలు తక్కువగా కురిశాయని, ఎగువ మానేరు, మధ్య మానేరు, అన్నపూర్ణ, మల్కపేట రిజర్వాయర్లలో నీటిమట్టాలు ప్రస్తుతం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు తాగునీరు, మూగజీవాలకు మాత్రమే వినియోగించడానికి ఉన్నాయన్నారు. రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసేలా చూడాలన్నారు. ఆయా శాఖల ప్రతీ మంగళ, బుధవారాల్లో ఆయా సమావేశాలకు హాజరై ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, నీటి మట్టాలు తదితర అంశాలపై రైతులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలో నూతనంగా బోర్లు వేసేందుకు తహసీల్దార్ వద్ద అనుమతి తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతీ గ్రామం, పట్టణంలో నీటి వృథాను అరికట్టాలన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, భగీరథ ఎస్ఈ రాములు, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, డీఏవో అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి శరత్‌బాబు, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేయాలి
బోయినపల్లి: రిజర్వాయర్లలోని నీరును తాగునీటికి, జీవాల కోసం వినియోగించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ తెలిపారు. మంగళవారం మండలంలోని విలాసాగర్ రైతువేదికలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు రైతులు వరి సాగు చేయొద్దని, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. కాగా మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు సాగు చేస్తున్న రామన్నపేటకు చెందిన ఆదర్శ రైతు మిట్టపల్లి కమలాకర్‌రెడ్డిని కలెక్టర్ అభినందించారు. అంగన్వాడీకేంద్రం, ప్రైమరీ స్కూల్‌ను సందర్శించారు. అనంతరం గ్రామంలోని అక్కెనపెల్లి కావ్య ఇందిరమ్మ ఇల్లును పరిశీలించారు. డీడబ్లూవో లక్ష్మిరాజం, ప్యాక్స్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రెడ్డి, సర్పంచులు ఏనుగుల కనుకయ్య, చింతలపల్లి కవిత వెంకటరెడ్డి, తహసీల్దార్ ఎండీ షరీఫ్ మోహియొద్దీన్, ఇంచార్జి ఎంపీడీవో శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


