● కరెంట్ లేక ఎకరం ఎండినా ఊరుకోం ● ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు
సిరిసిల్ల: కాంగ్రెసోళ్లకు రైతుల ఉసురు తగులుతుందని, ముందుచూపులేకనే కరెంట్ సమస్యలు ఎదురవుతున్నాయని సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) చైర్మన్ చిక్కాల రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులతో కలిసి శుక్రవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పొట్టదశలో ఉన్న పొలాన్ని కాపాడుకునేందుకు రైతులు జనరేటర్లు వాడే దుస్థితి వచ్చిందన్నారు. లోవోల్టేజీతో మోటార్లు కాలుతున్నాయన్నారు. బోయినపల్లి, నేరెళ్ల, గంభీరావుపేటల్లో కొత్త విద్యుత్ సబ్స్టేషన్లును ఏర్పాటు చేయాలని, ఉన్న వాటి సామర్థ్యం పెంచాలని కోరినా ఎన్పీడీసీఎల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తే.. కొందరు రైతులు ‘సెస్’ ఆఫీస్కు వచ్చి 16 గంటల సరిపోద్దని చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరెంట్ లేక ఒక్క ఎకరం పొలం ఎండినా ఊరుకోబోమని హెచ్చరించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. గోదావరి జలాలను అన్ని జిల్లాలకు అందించే పథకాన్ని ఎండబెట్టి ఎల్నినో వచ్చిందని కబుర్లు చెబుతున్నారన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్ ఉపాధ్యక్షుడు దార్ల సందీప్, నాయకులు ఆకునూరి శంకరయ్య, గజభీంకార్ రాజన్న, న్యాలకొండ రాఘవరెడ్డి, మ్యాన రవి, ఎదురుగట్ల చంద్రయ్యగౌడ్, రిక్కుమల్ల సంపత్, బాలు, కమలాకర్ పాల్గొన్నారు.


