● జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ
సిరిసిల్ల: ఎన్ఐ యాక్ట్(చెక్ బౌన్స్) కేసుల సత్వర పరిష్కారానికి నవంబర్ 21న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షురాలు పి.నీరజ తెలిపారు. జిల్లా కోర్టుహాలులో సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ల ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించిన సమన్వయ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ ఏళ్ల తరబడి తిరగకుండా, రాజీ మార్గం ద్వారా త్వరితగతిన పరిష్కరించుకోవాలని సూచించారు. మొదటి అదనపు జిల్లా జడ్జి పుష్పలత, పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లక్ష్మణాచారి, సిరిసిల్ల, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమాకాంతరావు, మనోహర్ పాల్గొన్నారు.
రగ్బీలో రాష్ట్రస్థాయికి ఎంపిక
గంభీరావుపేట: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ విద్యార్థిని దోమకొండ అనన్య రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడాపోటీలకు ఎంపికైంది. రంగారెడ్డి జిల్లాలో జరిగే పోటీల్లో అండర్–14 విభాగంలో అనన్య పాల్గొననుంది. గత నెల 29న జిల్లాస్థాయిలో నిర్వహించిన పోటీల్లో అనన్య, దుర్గ, అలేఖ్య ప్రతిభ కనబరిచారు. అనన్య రాష్ట్రస్థాయికి ఎంపికైంది. ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి రవీందర్, డీవైఎస్వో రాందాస్, ఎంఈవో గంగారాం, హెచ్ఎం పద్మ, రగ్బీ జిల్లా కార్యదర్శి హన్మంతు, ఎస్జీఎఫ్ మండల కన్వీనర్ బార భాను, పీఈటీ రేఖ, కోచ్ విక్రమ్ అభినందించారు.
సబ్సెంటర్లు ఉండవు
ఇల్లంతకుంట: సబ్సెంటర్ కొనుగోలు కేంద్రాలు ఉండవని ఒకే కొనుగోలు కేంద్రం ఉంటుందని జిల్లా కో–ఆపరేటీవ్ అధికారి రామకృష్ణ పేర్కొన్నారు. ఇల్లంతకుంట ప్యాక్స్ ఆఫీస్లో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో శుక్రవారం సమావేశమయ్యారు. లారీలకు జీపీఆర్ఎస్ ఉంటుందని, ధాన్యం కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం గుర్తించిన ఏడు రకాల సన్నాలకే బోనస్ వర్తిస్తుందని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు వసతులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్యాక్స్ చైర్మన్లు వెంకటరమణారెడ్డి, అన్నాడి అనంతరెడ్డి, వ్యవసాయాధికారి ప్రవీణ్, కార్యదర్శులు రవీందర్రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరవధిక సమ్మె
సిరిసిల్ల అర్బన్: ఉద్యోగ భద్రత, వేతన సంస్కరణలు, ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్ల సాధన కోసం ఎన్హెచ్ఎం జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు నిరవధిక సమ్మె చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 వేల మంది ఎన్హెచ్ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం, 5 శాతం వార్షిక ఇంక్రిమెంట్, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు, హెల్త్ ఇన్సూరెన్స్, పెండింగ్ పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగుతుందని జేఏసీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
ఆర్థిక ఇబ్బందులతో
న్యాయానికి దూరం కావొద్దు
వీర్నపల్లి: ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఏ ఒక్కరూ న్యాయానికి దూరం కాకూడదనే లక్ష్యంతో న్యాయ సేవాధికార సంస్థలు పనిచేస్తున్నాయని లోక్ అదాలత్ సభ్యుడు ఆడెపు వేణు అన్నారు. మండలంలోని గర్జనపల్లి, సీతారాంనాయక్ తండాల్లో శుక్రవారం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. ప్రజలందరికీ న్యాయం అందుబాటులో ఉండేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. కార్యక్రమాల్లో లోక్ అదాలత్ సభ్యుడు గుర్రం ఆంజనేయులు, సర్పంచ్లు బి.రాకేశ్గౌడ్, బి.లత, పారా లీగల్ వలంటీర్లు దేవేంద్ర, లావణ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.


