● సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రిలో మగబిడ్డలకు జన్మనిచ్చిన మహిళ
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి(జీజీహెచ్) వైద్యులు సాధారణ ప్రసవం ద్వారా అరుదైన విజయాన్ని సాధించారు. కరీంనగర్ జూబ్లీనగర్కు చెందిన గర్భిణీ ఊర్మిళకు శుక్రవారం వైద్యులు సాధారణ ప్రసవం చేయగా.. కవల మగపిల్లలకు జన్మనిచ్చింది. తల్లితోపాటు ఇద్దరు శిశువులు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సాధారణ ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేసిన గైనకాలజీ ప్రొఫెసర్లు డాక్టర్ సుచేతలక్ష్మి, డాక్టర్ సుగుణ, ప్రసవం చేసిన డాక్టర్ ప్రతిభ, నర్సింగ్ ఇన్చార్జి ఉమ, నర్సింగ్ ఆఫీసర్లు మమత, దీపలను జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ బి.ప్రవీణ్కుమార్ అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక వసతులు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


