పోషకాలు మెండుగా | - | Sakshi
Sakshi News home page

పోషకాలు మెండుగా

Oct 17 2026 8:12 AM | Updated on Oct 17 2026 8:12 AM

తొమ్మిది రోజులు.. తొమ్మిది రకాల ప్రసాదాలు పూలను ఆరాధిస్తూ.. ప్రసాదాలు భుజిస్తూ.. అనుబంధాలు.. ఆత్మీయతల కలయిక పాట.. ఆట.. ఆహారం

పూల పండుగ..

గంభీరావుపేట: బతుకమ్మ అంటేనే ప్రకృతికి ప్రతీక. ప్రకృతిలో సహజసిద్ధంగా లభించే ప్రతీ పువ్వుకు బతుకమ్మలో చోటు దక్కుతుంది. తెలంగా ణ ఆడపడచుల నిత్య జీవనంలో ఎదురయ్యే కష్టాలు..సుఖాలే బతుకమ్మ పాటలుగా వెలుగొందుతున్నాయి. జీవన విధానంలో భాగమైన ఆహారానికి కూడా బతుకమ్మ ఉత్సవాల్లో ప్రత్యేకత ఉంది. పువ్వులతోపాటు ప్రతి రోజూ సమర్పించే నైవేద్యాలకూ ప్రత్యేక స్థానం ఉంది. తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించే బతుకమ్మ వేడుకల్లో రోజుకో తీరు ఆహారం(ప్రసాదం) తీసుకెళ్తుంటారు. సంప్రదాయాలతోపాటు ఆహార వైవిధ్యం, అనుబంధాలు, పంచుకునేతత్వం దాగి ఉన్నాయి.

పూలతో పూజ.. ప్రసాదాలతో పరవశం

బతుకమ్మ పండుగలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు మహిళలు తమ ఇళ్లలో సంప్రదాయ వంటకాలను తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. మొదటి రోజు పెసరపప్పుతో చేసిన వడలు, రెండో రోజు మలీద లడ్డూలు, మూడో రోజు చలిమిడి, నాలుగో రోజు పరమాన్నం, ఐదో రోజు బూరెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆరో రోజు వెలగపండును సమర్పించే సంప్రదాయం ఉంది. ఏడో రోజు అలిగిన బతుకమ్మ కాబట్టి ఎలాంటి నైవేద్యాలు సమర్పించరు. ఎనిమిదో రోజు అట్లు, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా కొబ్బరి నువ్వులు, వేరుశెనగ గింజలు, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, పరమాన్నం వంటి తొమ్మిది రకాల సద్దులను తయారు చేసి సమర్పిస్తారు.

ఇంట్లో లభించే పదార్థాలతోనే..

ఇంట్లో లభించే పదార్థాలతోనే రుచికరమైన వంటకాలను తయారు చేసి బతుకమ్మకు సమర్పించడం సంప్రదాయంలోని ప్రత్యేకత. పండుగ సమయంలో బంధువులు, ఇరుగుపొరుగు వారితో ప్రసాదాలు పంచుకోవడం అనుబంధాలకు నిదర్శనం. ఒక్కో నైవేద్యంలో శరీర రక్షణకు, రోగ నిరోధకశక్తి పెంపు వంటి లక్షణాలు ఉంటాయి.

తరతరాల వారధి

బతుకమ్మలో ఉపయోగించే తంగేడు, గునుగు తదితర స్థానిక పూలు ప్రకృతితో మనకున్న అనుబంధాన్ని చాటుతాయి. పండుగ సందర్భంగా మహిళలు ఒకచోట చేరడం, చిన్నారులకు పాటలు, పూలపేర్లు, నైవేద్యాల గురించి తెలియజేయడం ద్వారా సంప్రదాయాలు ఒక తరం నుంచి మరో తరానికి చేరుతున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎన్నో మార్పులు వచ్చినా బతుకమ్మ పండుగ తన ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement