ఊపిరి ఆడనివ్వని కరీంనగర్ డంప్‌యార్డు
ఎయిర్ పోర్టు ఏర్పాటుపై నీలినీడలు
నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధ్దరించాలి
మధ్యమా‘నీరు’.. ఎగువ మానేరు చేరాలి
వేములవాడ అభివృద్ధిపై ఆశలు
తీరని సిరిసిల్ల మరమగ్గాల సమస్య
సీఎం హోదాలో నేడు తొలిసారి ఉమ్మడి జిల్లాకు రేవంత్‌రెడ్డి రాక
సాక్షిప్రతినిధి, కరీంనగర్/సిరిసిల్ల ●:
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయ చైతన్యా నికి, ప్రజా ఉద్యమాలకు ఖిల్లా.. ఉత్తర తెలంగాణకే తలమానికంగా నిలుస్తోంది. మరింత అభివృద్ధి చేస్తే భారతదేశ పటంలో మరింత వెలుగొందనుంది. ప్రభుత్వాలు, పాలకులు మారుతున్నా పలు ప్రధాన సమస్యలు ఇప్పటికీ తీవ్రంగా వేధిస్తున్నాయి. పరిష్కరిస్తామన్న మాటలు తప్పా.. చేతల్లో కనిపించని అభివృద్ధి. ముఖ్యంగా.. కరీంనగర్‌లోని డంప్‌యార్డు ఏళ్లకాలంగా కంపు కొడుతుండగా, పెద్దపల్లి జిల్లా బసంత్‌నగర్‌లో ఇంకా విమానం ఎగురుతుందని ఆశలు పెట్టుకున్నారు. జగిత్యాలలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ తీపి కబురు కోసం ఎదురుచూస్తుండగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మధ్యమానేరు, రాజన్న ఆలయం, మరమగ్గాల సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డి నేడు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏళ్లుగా వేధిస్తున్న ప్రజాసమస్యలకు మోక్షం లభిస్తుందని ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు.
● జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలో ఉన్న నిజాంషుగర్ ఫ్యాక్టరీ 12ఏళ్ల క్రితం మూతపడింది. వేలాది మందికి ఉపాధి కల్పించేందుకు, చెరుకు పండించే రైతులకు మార్కెటింగ్ కల్పించేందుకు ఈ షుగర్‌ఫ్యాక్టరీ దోహదం చేసింది. షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో వేలాదిమంది ఉపాధిపై ప్రభావం పడింది. అప్పటి నుంచి ఫ్యాక్టరీని తెరిపించాలనే డిమాండ్ కొనసాగుతూనే ఉంది. ఇటీవల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన షుగర్‌ఫ్యాక్టరీ అధ్యయనానికి కమిటీ వేశారు. ఫ్యాక్టరీని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి.
● గోదావరి జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరుకు చేరాయి. మధ్యమానేరు నుంచి గంభీరావుపేట మండలం ఎగువ మానేరు జలాశయానికి చేర్చాల్సి ఉంది. ఇందు కోసం ఉద్దేశించిన కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు పూర్తి కాలేదు. కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ వద్ద 3 టీఎంసీలతో రిజర్వాయర్ పూర్తయింది. కాల్వల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ప్యాకేజీ–10, 11, 12 పూర్తికాగా 9వ ప్యాకేజీ పనులు మధ్యలో వదిలేశారు. గోదావరి జలాలతో నర్మాల ఎగువ మానేరు, నిమ్మపల్లి మూలవాగు, ఎల్లారెడ్డిపేట సింగసముద్రం, జిల్లెల్ల నక్కవాగు, రుద్రంగి సూరమ్మ చెరువు నిండితే 2లక్షల ఎకరాలు సేద్యం అవుతాయి.
● దక్షిణ కాాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. రూ.250 కోట్లతో ఆలయ, రోడ్ల విస్తరణ పనులు చేపట్టారు. చెరువులో పార్కును అభివృద్ధి చేశారు. మూలవాగుపై రెండో వంతెన నిర్మాణం తుది దశకు చేరింది. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో ఆలయ అభివృద్ధి సాగుతుండగా మరిన్ని నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మధ్యమానేరు బ్యాక్ వాటర్‌లో బోటింగ్, టూరిజం అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.
● సిరిసిల్లలో మరమగ్గాల పరిశ్రమ వేళ్లూనుకుని ఉంది. మగ్గాలను ఆధునీకరించి, డయింగ్ పరిశ్రమకు ప్రత్యేక స్థలాన్ని కేటాయిస్తే.. పరిశ్రమ అభివృద్ధికి అడుగులు పడతాయి. నేత కార్మికులను ఓనర్లుగా మార్చే ‘వర్కర్ టూ ఓనర్’ పథకానికి షెడ్లను నిర్మించారు. సాంచాలు ఏర్పాటు చేయలేదు. ఆ షెడ్లలో గోదాములుగా ధాన్యంతో నింపేశారు. ఇందిరా మహిళా శక్తి చీరలు, ప్రభుత్వ వస్త్రోత్పత్తి ఆర్డర్లతో బడా వ్యాపారులే బాగుపడుతున్నారు. కామన్ ఫెసిలిటీ సెంటర్లు, శ్రమించే కార్మికులకు బీమా సదుపాయం, హెల్త్ కార్డులు, పొదుపు పథకాలు, నూలు రాయితీ వంటి పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాల్సి ఉంది.


