వేములవాడ ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ల వివరాలు
రాజన్న ఆలయంలో కమిటీలతోనే శివరాత్రి వేడుకలు
ఆదాయంలో ముందు.. అభివృద్ధిలో వెనక
ఇటీవల యాదాద్రి ఆలయ ట్రస్ట్‌బోర్డు నియామకం
ఆది శ్రీనివాస్ నిర్ణయమే కీలకం
సిరిసిల్ల: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడకు 800 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. ఇంత ప్రాధాన్యం గల గుడికి దశాబ్దకాలంగా ట్రస్ట్ బోర్డు లేదు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రి ఆలయ ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు చేయడంతో వేములవాడ రాజన్న ఆలయ ట్రస్ట్‌బోర్డుపై చర్చలు మొదలయ్యాయి. ఏటా శివరాత్రి వేడుకల సమయంలో ఉత్సవ కమిటీతోనే వెల్లదీస్తున్నారు. ఏడాదిగా రూ.127కోట్లతో ఆలయ అభివృద్ధి పనులు సాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డు విస్తరణ పనులు మొదలయ్యాయి. ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటు చేస్తే బాగుంటుందనే చర్చలు మొదలయ్యాయి.
ట్రస్ట్‌బోర్డు లేక 13 ఏళ్లు
వేములవాడ ఆలయ ట్రస్ట్‌బోర్డు లేక ఇప్పటికీ 13 ఏళ్లు గడుస్తోంది. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం బొమ్మ వెంకన్నను ఆలయ ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా ని యమించింది. అప్పటి నుంచి ధర్మకర్తల మండలి లేదు. ఏటా మహాశివరాత్రి వేడుకలకు ముందు ఉత్సవ కమిటీని వేస్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రస్ట్‌బోర్డు లేక ఆలయ అభివృద్ధి, నిర్వహణలో అవాంతరాలు ఎదురవుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) తరహాలో పూర్తిస్థాయి ధర్మకర్తల మండలికి స్వయం ప్రతిపత్తిని కల్పించేందుకు గతేడాది శాసనసభలో చట్టసవరణ చేశారు.
63 ఏళ్ల కిందటే ట్రస్ట్‌బోర్డు
రాజన్న ఆలయంలో 1963లో అంటే.. 63 ఏళ్ల కిందటే తొలి ట్రస్ట్ బోర్డును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ధర్మకర్తల మండలిని నియమిస్తూ వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో రాజకీయంగా ప్రాధాన్యమున్న ఆలయ ట్రస్ట్‌బోర్డు కమిటీ నియామకంపై ప్రభుత్వాలు ఆచీతూచీ కమిటీలను నియమించాయి. 13 ఏళ్లు ట్రస్ట్‌బోర్డు కమిటీ లేదు.
కలెక్టరేట్‌లో వీటీడీఏ ఆఫీస్
వేములవాడ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీ(వీటీడీఏ)ని 2016లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సీఎం చైర్మన్‌గా, కలెక్టర్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. పూర్తిస్థాయిలో నిధులు కేటాయించకపోవడంతో వీటీడీఏ నామమాత్రంగా మారింది. వేములవాడ ఆలయ అభివృద్ధి ఆఫీస్‌ను కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. 2024 నవంబరులో సీఎం రేవంత్‌రెడ్డి వేములవాడకు వచ్చి ఆలయ అభివృద్ధికి రూ.127 కోట్లు కేయించారు. సీఎం నిధులు కేటాయించడంతో ఆలయ విస్తరణ పనులు సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయం ముందు రోడ్ల విస్తరణ పనులు సాగుతున్నాయి. ఆలయ పుష్కరిణి అభివృద్ధి, గోశాల నిర్మాణం, విస్తరణ, మురికికాల్వల నిర్మాణాలు సాగుతున్నాయి. రాజన్న భక్తులకు భీమేశ్వర ఆలయంలో దర్శనాలు కల్పించారు.
ట్రస్ట్‌బోర్డు ఉంటే..
అదే ఆలయ ట్రస్ట్‌బోర్డు ఉంటే ఆలయ అభివృద్ధిపై తరచూ సమీక్షలు.. ప్రొటోకాల్ నిర్వహణ, దాతల నుంచి విరాళాలు సేకరించి వసతి గదుల నిర్మాణాలు చేసే అవకాశం ఉంటుంది. ట్రస్ట్‌బోర్డు ఏర్పాటుతో రాజకీయంగా కొందరికి పదవులు అందించి సముచిత స్థానం ఇచ్చినట్లు అవుతుందని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
వేములవాడ రాజన్న ఆలయ
ముఖ ద్వారం (ఫైల్)
సీఎం రేవంత్‌రెడ్డికి సన్నిహితుడైన వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నిర్ణయమే ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటులో కీలకం కానుంది. గతంలో రెండు పర్యాయాలు ధర్మకర్తల మండలి చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉన్న ఆది శ్రీనివాస్ వేములవాడ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. పనులు చేయించడంలో, బిల్లులు ఇప్పించడంలో వెంట పడుతున్నారు. వేములవాడ ఆలయ ట్రస్ట్‌బోర్డును టీటీడీ తరహాలో ఏర్పాటు చేయాలని ఆది శ్రీనివాస్ భావిస్తున్నారు. ఆది శ్రీనివాస్ నిర్ణయం మేరకు ట్రస్ట్‌బోర్డు ఏర్పాటు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. దక్షిణకాశీకి పాలకమండలి దరి చేరితే.. అటు అభివృద్ధికి.. ఇటు దాతల సాయంతో ఆధునిక వసతుల ఏర్పాటుకు అవకాశం లభించనుంది.


