గాలిలో ప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

గాలిలో ప్రాణాలు

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

రోడ్డు రద్దీగా ఉంటుంది

నందికమాన్‌ నుంచి కొదురుపాక వరకు డేంజర్‌ రోడ్డు దాటాలంటే జంకుతున్న గ్రామస్తులు గాలిలో కలుస్తున్న ప్రాణాలు

నిత్య ప్రమాదాలు..

వేములవాడఅర్బన్‌: ఈ రోడ్డుపై ప్రయాణమంటేనే వాహనదారులు జంకుతున్నారు. ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారులు అతివేగం.. అజాగ్రత్తగా నడుపుతుండడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. సిరిసిల్ల–కరీంనగర్‌ రహదారిలో వేములవాడ నందికమాన్‌ నుంచి కొదురుపాక వంతెన వరకు డబుల్‌ రోడ్డు మాత్రమే ఉంది. ఫోర్‌లేన్‌ రోడ్డు పూర్తికాకపోవడం.. వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుండడంతో ఈ 10 కిలోమీటర్ల దూరంలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడు నెలల్లో దాదాపు ఇరువై వరకు ప్రమాదాలు జరుగగా.. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

కుదిపేసిన అనుపురం ప్రమాదం

గత గురువారం వేములవాడ అర్బన్‌ మండలం అనుపురం వద్ద ఆర్టీసీ అద్దె బస్సు వలసకూలీలు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొనడంతో 25 మంది గాయపడ్డారు. ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. బతుకుదెరువు కోసం మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వలస వచ్చిన కార్మికులు ఇలా ప్రమాదానికి గురికావడం కలచివేసింది. గత నాలుగు రోజులుగా క్షతగాత్రులు సిరిసిల్ల, వేములవాడ ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో 23 కుటుంబాలు వేదనకు గురయ్యాయి. వేములవాడ మండలంలోని గ్రామాలు కొడుముంజ, శాభాష్‌పల్లి, శాంతినగర్‌, నాంపల్లి, అనుపురం, రుద్రవరం, గొల్లపల్లె, సంకెపల్లి, ఆరెపల్లి రోడ్లను ఆనుకొని ఉన్న గ్రామాలు. ఆయా గ్రామస్తులు రోడ్డు దాటాలంటే జంకుతున్నారు.

నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనల రద్దీతో రోడ్డు అవతల దుకాణానికి వెళ్లాలంటే భయంగా ఉంటుంది.

– గాజుల చంద్రమౌళి, అనుపురం

ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలు

గత ఐదు నెలల క్రితం కరీంనగర్‌కు చెందిన భార్య భర్తలు వసీమ్‌, ఐఫా బైక్‌పై వస్తుండగా ఆరెపల్లి వద్ద లారీ ఢొకొట్టడంతో ఇద్దరు మృతిచెందారు. వాళ్ల కుమార్తెకు గాయాలయ్యాయి.

బోయినపల్లి మండలం విలాసాగర్‌కు చెందిన రవి బైక్‌ను నాంపల్లి వద్ద లారీ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు.

గొల్లపల్లెకు చెందిన ఇద్దరు యువకులు బైక్‌పై రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టడంతో మధు కాలు విరిగింది.

ఆరెపల్లి శివారులో కారు, లారీ ఢీకొనడంతో తంగళ్లపల్లి మండలం మండెపల్లికి చెందిన వంశీ అక్కడికక్కడే మృతిచెందాడు.

అనుపురం వద్ద ఆరు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గీతాకార్మికుడు శ్రీహరి చనిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement