వేములవాడరూరల్: ఓటర్లు తమ పేరు ఓటరు జాబితాలో ఉందో.. లేదో పరిశీలించుకో వాలని వేములవాడ మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు కోరారు. 13వ వార్డు కోనాయపల్లిలో చేపట్టిన ఎస్‌ఐఆర్‌ను ఆదివారం పరిశీలించారు. ఓటరు జాబితా నమోదు పారదర్శకంగా సాగాలంటే బూత్‌స్థాయి అధికారులకు(బీఎల్వోలు), బూత్ స్థాయి ఏజెంట్లు(బీఎల్‌ఏలు) సహకరించాలన్నారు. బీఎల్‌ఏ సాయిని అంజయ్య, నాయకుడు మూడపల్లి నాగరాజు పాల్గొన్నారు.
వైస్‌చైర్మన్ రాజీనామా చేయాలి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ వైస్‌చైర్మన్ దార్ల సందీప్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్‌లీడర్ ఆడెపు చంద్రకళ డిమాండ్ చేశారు. సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తానని రూ.లక్ష డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అన్యాయం జరగనివ్వదని స్పష్టం చేశారు. దార్ల సందీప్ బాధితులు ఉంటే మాజీ కౌన్సిలర్ యెల్లే లక్ష్మీనారాయణను సంప్రదించాలని కోరారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, కౌన్సిలర్ కూరపాటి శ్రీశైలం, ఏఎంసీ డైరెక్టర్ ఖాజా మొయినొద్దీన్, నాయకులు వెంగళ లింగ, లాయక్ సుల్తానా, రుద్ర శ్రీనివాస్, లింగంపల్లి గంగరాజు పాల్గొన్నారు.
ఉద్యమకారులు ఆధారాలు సమర్పించాలి
సిరిసిల్లటౌన్: తెలంగాణ ఉద్యమకారులు తమ వద్ద ఉన్న ఆధారాలను సమర్పించాలని జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక కన్వీనర్ గరిపెల్లి ప్రభాకర్ కోరారు. సిరిసిల్లలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఈనెల 16న హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారుల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్థానిక ఆర్యవైశ్య భవనంలో మంగళవారం పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. వేదిక కో–కన్వీనర్ బియ్యంకార్ శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రాగుల జగన్, సీపీఐ నాయకులు నల్ల చంద్రమౌళి, చీకోటి అనిల్‌కుమార్, ఎండీ మేరాజ్, కుసుమ గణేశ్, మంగలి చంద్రమౌళి పాల్గొన్నారు.
వంట కార్మికులకు గౌరవ వేతనాలు ఇవ్వాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): మధ్యాహ్న భోజన కార్మికులకు గౌరవ వేతనం అందించాలని మధ్యాహ్న భోజన వంట కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షురాలు గొట్టె సంతోష కోరారు. హైదరాబాద్‌లో తలపెట్టిన ధర్నా కార్యక్రమానికి ముస్తాబాద్ నుంచి ఆదివారం కార్మికులు తరలివెళ్లారు. కనీస గౌరవ వేతనం రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లక్ష్మి, అంజమ్మ, పద్మ, రేణుక, కనకవ్వ, దేవలక్ష్మి, పోషవ్వ పాల్గొన్నారు.
జాతీయ పారా పోటీల్లో కాంస్యం
సిరిసిల్లటౌన్/వీర్నపల్లి: తైక్వాండో ఓపెన్ జాతీయ పారా చాంపియన్‌షిప్ పోటీల్లో గర్జనపల్లిలోని బంగిరెడ్డితండాకు చెందిన భూక్య సక్కుబాయి ప్రతిభ చాటింది. మహారాష్ట్రలోని పూణేలో జరిగిన ఐదో ఇండియా తైక్వాండో ఓపెన్ పారా జాతీయ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించింది.


