శతశాతం దిశగా.. | - | Sakshi
Sakshi News home page

శతశాతం దిశగా..

Mar 6 2026 8:29 AM | Updated on Mar 6 2026 8:29 AM

సిరిసిల్ల స్వరూపం

పన్ను వసూళ్లలో దూసుకెళ్తున్న సిరిసిల్ల బల్దియా

నంబర్‌ వన్‌ ర్యాంక్‌ దిశగా అడుగులు

సహకరిస్తున్న పట్టణ ప్రజలు

ఇప్పటికే 76 శాతం వసూలు

నూరు శాతం టార్గెట్‌

పన్నుల వసూలులో ఆదర్శ విధానాలు

సిరిసిల్లటౌన్‌: సిరిసిల్ల మున్సిపాలిటీ పన్ను వసూలులో దూసుకెళ్తోంది. ఈనెలాఖరులోగా శతశాతం సాధించేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే 76 శాతం పన్నులు వసూలు చేసి ప్రణాళికతో ముందుకెళ్తోంది. పట్టణ ప్రజలు సైతం మున్సిపల్‌ అధికారులకు సకాలంలో ట్యాక్స్‌లు చెల్లించి సహకరిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా నంబర్‌ వన్‌ ర్యాంక్‌ సాధనే ధ్యేయంగా బల్దియా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రూ.6.99 కోట్లు డిమాండ్‌

మున్సిపల్‌కు సంబంధించిన పన్నుల వసూళ్లపై కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం, అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపారు. గత ఆర్థిక సంవత్సరాల్లో సాధించిన నూరుశాతం వసూళ్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. లోటు బడ్జెట్‌ను అధిగమించడంతోపాటు గతకీర్తిని కొనసాగించమే లక్ష్యంగా ప్రైవేటు ఆస్తుల పన్నుల విషయంలో చర్యలు తీసుకుంటుంది. సిరిసిల్లలో మొత్తంగా 23,769 హౌజ్‌హోల్డ్స్‌ ఉన్నాయి. వీటికి సంబంధించిన ఆస్తిపన్నులను అధికారులు రెండు నెలలుగా వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్‌, నాన్‌ రెసిడెన్షియల్‌, ఇతర ఆస్తులకు సంబంధించిన పన్నులు రూ.6.99 కోట్లు ఉండగా ఇప్పటికే 76 శాతం వసూలయ్యాయి.

39 బృందాలు.. 117 మంది

పన్నుల వసూళ్లకు సిరిసిల్లలోని 39 వార్డుల్లో 117 మంది శ్రమిస్తున్నారు. ఒక్కో టీమ్‌లో వార్డు ఆఫీసర్‌, బిల్‌ కలెక్టర్‌, జవాన్లతో కలిసి ముగ్గురు చొప్పున బృందాలు 39 వార్డుల్లో తిరుగుతున్నారు. 14 మంది బిల్‌కలెక్టర్లతో గ్రూపులను ఏర్పాటు చేశారు. నిత్యం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ఇంటింటా తిరుగుతూ పన్ను వసూలు చేస్తున్నారు. రెసిడెన్షియల్‌ 18,227, నాన్‌రెసిడెన్షియల్‌ 5,542, ఇతర మొత్తంగా 23,769 ఉన్నాయి. ఈ ఏడాదికి మున్సిపాలిటీకి రావాల్సిన పన్నులు రూ.6.99 కోట్లు డిమాండ్‌ ఉంది. వీటి వసూలుకు మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏ.ఖదీర్‌పాషా నేతృత్వంలో ఫిబ్రవరి ఆరంభం నుంచే పన్నుల వసూలు చేపట్టారు. దశాబ్దకాలంలో పట్టణంలో జరిగిన అభివృద్ధి ప్రజలకు కనిపిస్తుండడంతో పన్నుల వసూలుకు వెళ్తున్న సిబ్బందికి స్వచ్ఛందంగా సహకరిస్తున్నారు.

రెసిడెన్షియల్‌ గృహాలు 18,113

కమర్షియల్‌ దుకాణాలు 2,569

ఇతరాలు 2,805

రాష్ట్రప్రభుత్వ ఆస్తులు 52

మెత్తం ఆస్తులు 23,532

బల్దియా సంబంధిత పన్నుల వసూళ్లలో అధికారులు నూరుశాతం టార్గెట్‌తో ముందకు వెళ్తున్నారు. పట్టణంలోని 39 వార్డుల్లో స్థానిక కౌన్సిలర్ల సహాయాన్ని తీసుకుంటున్నారు. బల్దియాకు కొత్తగా ఆదాయ వనరులు పెంచడంపై దృష్టి సారించారు. పరిశుభ్ర పట్టణంగా కీర్తిపొందిన సిరిసిల్లలో వీధుల్లో చెత్తను వేయడం నిషేధించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు వేస్తున్నారు. ప్లాస్టిక్‌ నిషేదాన్ని అమలుచేస్తూ ఉల్లంఘనులకు జరిమానాలు విధించడం, ప్రతీ దుకాణం నుంచి తడి, పొడి చెత్తను సేకరించేందుకు విధిగా ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.300 వరకు యూజర్‌ చార్జీలు వసూలు చేస్తున్నారు. రోడ్డుపై టేలాలు వేయడం, వ్యాపారాలు చేయడం, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై దాడులు చేసి ఆదాయం పెంచారు. గృహాల పన్నులతోపాటు ట్రేడ్‌ లైసెన్సులు, తాగునీరు తదితర పన్నులు వసూలు చేసేలా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.

పన్నుల వసూళ్లలో కలెక్టర్‌ సూచనలతో ఆదర్శ విధానాలు అవలంబిస్తున్నాం. చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌, కౌన్సిలర్ల సహకారంతో ముందుకెళ్తున్నాం. పన్నుల వసూళ్లలో ఇప్పటికే రాష్ట్రంలో మూడో స్థానంలో ఉన్నాం. నెలాఖరు వరకు వంద శాతం వసూలు చేసి నంబర్‌ 1 స్థానాన్ని సాధిస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తుంది. 39 బృందాలను ఆర్‌ఐ, ఆర్‌వో, ఎస్‌ఐ, ఏఈలు మరో ఎనిమిది టీమ్స్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. – ఎం.ఏ.ఖదీర్‌పాషా, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement