పాఠశాలలో మద్యం కలకలం | - | Sakshi
Sakshi News home page

పాఠశాలలో మద్యం కలకలం

Feb 5 2026 7:45 AM | Updated on Feb 5 2026 7:45 AM

పాఠశాలలో మద్యం కలకలం

పాఠశాలలో మద్యం కలకలం

జిల్లా పరిషత్‌ హై స్కూల్‌లో ఘటన

చిగురుమామిడి: చిగురుమామిడి మండలంలోని ఓ జిల్లాపరిషత్‌ పాఠశాలలో కొందరు విద్యార్థులు మధ్యాహ్నం సమయంలో మద్యం తాగిన సంఘటన చర్చనీయాంశమైంది. 8వ తరగతి చదువుతున్న కొందరు విద్యార్థులు ఈనెల 3న భోజన విరామ సమయంలో బయటకు వెళ్లి ఒక మద్యం బాటిల్‌, కూల్‌డ్రింక్‌ తెచ్చుకుని పాఠశాలలోనే సేవించినట్లు సమాచారం. ఇది చూసిన కొందరు విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో పాఠశాల హెచ్‌ఎం బుధవారం పేరెంట్స్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు. జరిగిన సంఘటనపై చర్చించారు. ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్‌ దెబ్బతినే ప్రమాదం ఉందని, ఉపాధ్యాయులు వారి కదలికలను ఎందుకు పట్టించుకోవడంలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేయాలని సర్పంచ్‌ సూచించారు. పాఠశాల సమీపంలోనే కొందరు బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్నారని, వాటిని మూసివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ విషయంపై హెచ్‌ఎంను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

వరకట్నం వేధింపులకు వివాహిత బలి

బోయినపల్లి(చొప్పదండి): ఇద్దరు కుమారులు పుట్టాక భర్త పెట్టే అదనపు కట్నం వేధింపులు భరించలేక బోయినపల్లికి చెందిన దొంతరవేణి నర్మద(28) ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ తెలి పారు. బోయినపల్లికి చెందిన నర్మదకు ఐదేళ్ల క్రితం మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన దొంతరవేణి నరేశ్‌తో వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. పెళ్లయిన ఏడాది తర్వాత అదనంగా రూ.2లక్షలు కట్నం తీసుకురావాలని నర్మదను భర్త వేధించేవాడు. దీంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకొని భార్య పిల్లలను బాగా చూసుకుంటానని ఒప్పుకున్నాడు. ఈక్రమంలో ఆరు నెలల క్రితం ఉపాధి కోసం దుబాయి వెళ్తానంటే నరేశ్‌ మామ ఊరుమడ్ల రాజయ్య డబ్బులు వెచ్చించి పంపించాడు. అక్కడికి వెళ్లిన తర్వాత సైతం నరేశ్‌ వైఖరిలో మార్పు రాకపోగా.. ఫోన్‌లో భార్యను కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి. తీవ్ర మానసిక వేదనకు గురైన నర్మద మంగళవారం బోయినపల్లిలోని తన తల్లిగారింట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నర్మద తండ్రి ఊరుమడ్ల రాజయ్య ఫిర్యాదుతో దొంతరవేణి నరేశ్‌పై కేసు నమోదు చేశారు.

దరఖాస్తులు ఆహ్వానం

విద్యానగర్‌(కరీంనగర్‌): ఆర్టీసీ కరీంనగర్‌ రీజియన్‌లో టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లు డిప్లొమా అప్రెంటిషిప్‌ కోసం అర్హతున్న అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కరీంనగర్‌ రీజియన్‌ మేనేజర్‌ బి.రాజు తెలిపారు. వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకున్న అభ్యర్ధులు ఈనెల 24 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement