యూరియా ఏదయా
● అవసరాన అన్నదాతకు ఇదేం అవస్థ
● యాప్‌లో జిల్లావ్యాప్తంగా యూరియా నిల్వ సున్నా ● ఏవోల నిర్లక్ష్యం.. పడకేసిన పర్యవేక్షణ
కరీంనగర్ అర్బన్: ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి అన్నదాతను ఆందోళనకు గురి చేస్తోంది. యూరియా అక్రమ రవాణాకు చెక్ పెడుతూ ప్రభుత్వం యాప్‌ను తెరపైకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 1నుంచి సదరు విధానం అమలవుతుండగా తదనుగుణ పర్యవేక్షణ లేమి రైతులకు గుదిబండగా మారింది. యాప్ ద్వారానే యూరియా బుక్ చేసుకోవాలని చెబుతున్నా వ్యవసాయ శాఖ అసలు యూరియా నిల్వలు ఏ మేరకు ఉన్నాయి, ఎంత అవసరమనే కోణంలో ప్రణాళిక లేకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
అత్యవసర వేళ ఇదేం కొరత
యాసంగి సీజన్‌కు గానూ జిల్లాలో 2,59,065 ఎకరాల్లో వరి సాగవగా, 29,396 ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. అన్ని పంటలు కలిపి 2,89,017 ఎకరాలు సాగులో ఉంది. ఈ సమయంలో వరి, మొక్కజొన్న పంటలకు యూరియా వేయడం అత్యవసరం. కానీ రైతులు మాత్రం ఫర్టిలైజర్ దుకాణాల చుట్టూ తిరగడం, పడిగాపులు కాయడం ఆందోళనకర పరిణామం. ఆయా పంటలకు మూడు దశల్లో అంటే విడతల వారీగా యూరియా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో దశలో ఎకరానికి ఒక బస్తా మాత్రమే బుక్ కానుంది. జిల్లావ్యాప్తంగా యూరియా కొరత తీవ్రంగా ఉంది. జిల్లా కేంద్రంతో పాటు 16 మండలాలుండగా ఎక్కడా కూడా యూరియా బస్తా ఒక్కటి లేదని యాప్ స్పష్టం చేస్తోంది. అవసరమైన సమయంలో యూరియా వేస్తేనే పంటకు బలం కాగా దిగుబడి రానుంది.
ఎన్నికల విధుల్లో ఏవోలు.. ఇండెంట్ పెట్టేదెవరు
వాస్తవానికి యూరియా నిల్వలను అనుసరించి ఎప్పటికప్పుడు ఇండెంట్ పెట్టడం మండల వ్యవసాయ అధికారుల విధి. జిల్లాలో మాత్రం ఏ ఒక్క ఏవో కూడ తదనుగుణంగా విధులు నిర్వహించడం లేదనడానికి యాపే తార్కాణం. పలువురు ఏవోలు ఇన్‌ఛార్జీలుగా వ్యవహరిస్తుండగా విధులను విస్మరిస్తున్నారనే ఆరోపణలు పుష్కలం. మున్సిపల్ ఎన్నికల్లో విధులు కేటాయించగా యూరియా నిల్వలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో రైతులకు ఇబ్బందులు షరామామూలే.
యూరియా పక్కదారి?
యూరియా పక్కదారి పడుతుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ సర్వే నంబర్‌లో ఏ పంట సాగు చేశారనేది యాప్‌లో నమోదు కాలేదు. క్రాప్ బుకింగ్ వివరాలు నమోదుకాకపోవడంతో అక్రమార్కులు సాగులో లేని భూముల వివరాలతో యూరియా బుక్ చేస్తూ వ్యవసాయేతర పనులకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది. సాగులో లేని భూములు వేల ఎకరాలుండగా భవనాలు, రోడ్లు, ప్లాట్లు, దేవాలయాలు ఇతర నిర్మాణాలు ఉన్నా భూములూ ఉండగా యాప్‌పై అవగాహన ఉన్న అక్రమార్కులు యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. యూరియా కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.


