నిబంధనలు పాటించని వ్యాపారులు
పట్టించుకోని బల్దియా అధికారులు
రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో వస్త్రాలయం
సిరిసిల్లటౌన్: సిరిసిల్ల మున్సిపాలిటీ అధికారులు బడా వ్యాపారులకో లెక్క.. చిరువ్యాపారులకు రీతిలా వ్యవహరిస్తున్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో ఏర్పాటైన వాసవి వస్త్రాలయం షాపింగ్‌మాల్ విషయమే వీరి వైఖరికి సాక్ష్యంగా నిలుస్తుంది. ఓ బడావ్యాపారి తమ వ్యాపారసంస్థ ఏర్పాటులో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంటే మిన్నకుండడంపై విమర్శలు వస్తున్న వైనంపై ‘సాక్షి’ ఫోకస్ స్టోరీ.
ఎందుకింత ఉదాసీనత?
బల్దియాకు ఆదాయం వచ్చే భవనం, ట్రేడ్‌లైసెన్సులు అందించే అంశంలో కంచె చేను మేస్తున్న చందంగా అధికారులు ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ నిబంధనలకు నీళ్లొదిలిన ఓ బడావ్యాపారి తమదైన శైలిలో బల్దియా ఆదాయానికి గండికొడుతున్నారు. పట్టణంలోని భావనరుషినగర్ ప్రాంతంలో పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారీ జీ+4 అంతస్తుల్లో భవనం నిర్మించారు. దీనికి రెసిడెన్షియల్ భవనంగా అనుమతులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే రూ.కోట్లు వెచ్చించి సదరు బడావ్యాపారి తమ వస్త్ర వ్యాపారంలో భాగంగా బ్రాంచ్‌ని ఇక్కడ ప్రారంభించారు. దీనికి నామమాత్రంగా సెల్ఫ్ అసెస్‌మెంట్‌గా ట్రేడ్‌లైసెన్స్ పొందారు. రెసిడెన్షియల్ భవనంలో వస్త్రాలయం ఏర్పాటు చేయడం నిబంధనలకు విరుద్ధం. ఈవిషయంపై నెల రోజులుగా బల్దియా అధికారులకు ఫిర్యాదులు అందినా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మొదటి నుంచి వివాదమే..
వాసవి వస్త్రాలయం వ్యాపారి తీరు షాప్ ప్రారంభానికి ముందు నుంచే వివాదాస్పదంగా ఉంది. ఫిబ్రవరిలో ప్రారంభానికి వారం రోజుల ముందే పట్టణంలోని ప్రధాన డివైడర్లు, జంక్షన్లు, ప్రధాన ఏరియాల్లో భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్స్ ఏర్పాటు చేశారు. వాటికి అనుమతులు తీసుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. ఇక వస్త్రాలయం ప్రారంభానికి ఇద్దరు సినీతారలను తీసుకొచ్చారు. ఇందుకు పట్టణంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, డప్పుకళాకారుల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. కమర్షియల్ భవనంలో నిబంధనల ప్రకారం మున్సిపల్ అనుమతులు పొందాల్సి ఉంది. కానీ ఇవేవి పట్టింపులేకుండా దర్జాగా రెసిడెన్షియల్ అనుమతులున్న భవనంలో షాపింగ్‌మాల్‌ను ప్రారంభించారు. ఇందుకు పలువురు పెద్దమనుషుల సహకారంతో సదరు వ్యాపారి తతంగం నడిపించారన్న ఆరోపణలు ఉన్నాయి.


