గడువు ముగిసింది.. దిగులు మిగిలింది | - | Sakshi
Sakshi News home page

గడువు ముగిసింది.. దిగులు మిగిలింది

Apr 1 2026 8:18 AM | Updated on Apr 1 2026 8:18 AM

● మావోళ్లేరి..? ● ఎవరికీ పట్టని ఆ నలుగురు ‘అన్నలు’

నిఘా వర్గాలకు తెలియదు.. మావోయిస్ట్‌ పార్టీ చెప్పదు

కుటుంబ సభ్యుల్లో ఆందోళన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో కలవరం

‘వెనకచ్చే ఆవుల్లారా.. ఎర్ర ఆవుల్లారో.. శ్రీరామ రామ చంద్రుడా.. మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా..

ముందచ్చే లేగల్లారా.. ముద్దు లేగల్లారో.. శ్రీరామ రామచంద్రుడా..

మీరందరొస్తుండ్రు.. నా కొడుకు ఏడో.. శ్రీరామ రామ చంద్రుడా..

మందిలో నా కొడుకు ముందుండేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా..

గోదారి అలలపై ఎదురీదేటోడే.. శ్రీరామ రామ చంద్రుడా..

కళ్లలో కదిలే కొడుకు కనపడకాపాయే.. శ్రీరామ రామ చంద్రుడా..

ఏ పాపిస్టి కళ్లల్లో కొడుకు పడ్డాడో.. శ్రీరామ రామ చంద్రుడా..

ఏ దేవుడు చెబుతాడో నా కొడుకు జాడ.. శ్రీ రామ రామ చంద్రుడా..’

సిరిసిల్ల: ‘దేశంలో దశాబ్దాలుగా వేళ్లూనుకున్న నక్సలిజాన్ని అంతమొందించామని, మావోయిస్టుల నుంచి విముక్తి కల్పించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. మార్చి 31లోగా నక్సలైట్లు లేని దేశంగా తీర్చుదిద్దుతామని పది నెలల కిందటే ప్రకటించిన కేంద్రం ఆ దిశగా భద్రతాదళాలతో దాడులు చేసింది. 12 రాష్ట్రాల్లో మావోయిస్టు ఉద్యమాన్ని తుదముట్టించామని కేంద్ర మంత్రి వెల్లడించారు.’

‘ఈ ప్రకటనకు ముందే సీపీఐ(ఎంఎల్‌) మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ముఖ్య నేతలు లొంగుబాట పట్టారు. కొందరు ఆయుధాలను అప్పగించి, మరికొందరు నిరాయుధులుగా లొంగిపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లోని సాయుధ నక్సలైట్లు, మా వోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు లొంగిపోయారు. నాలుగు దశాబ్దాల కిందట ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోనూ మావోయిస్టు (అప్పట్లో పీపుల్స్‌వార్‌) పార్టీ ఉద్యమం బలంగా ఉంది. అప్పట్లో అడవి బాట పట్టిన ‘అన్నల’ ఆచూకీ ఇప్పటికీ చిక్కడం లేదు. కేంద్రం విధించిన గడువు ముగిసింది. కానీ, విప్లవోద్యమానికి అన్నలను అందించిన కుటుంబాలకు ఇంకా దిగులు మిగిలే ఉంది’.

ఆ నలుగురి ఆచూకీ ఏది..?

రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చాలా మంది ఆయుధాలు పట్టుకుని సాయుధపోరాట దారుల్లో వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు ఎన్‌కౌంటర్‌ కాగా, మరి కొందరు లొంగిపోయారు. మరో నలుగురు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు. కానీ ఆ నలుగురు ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో.. అసలు సజీవంగా ఉన్నారా..? లేరా.. అనే విషయాన్ని పోలీస్‌ నిఘా వర్గాలు, మావోయిస్టు పార్టీ వర్గాలు చెప్పడం లేదు. వారి ఆచూకీ తెలియక నాలుగు కుటుంబాల్లో కన్నీరు మిగిలే ఉంది. మావోయిస్టు నక్సలైట్ల సామూహిక లొంగుబాటు, అరెస్ట్‌లు, ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో ఆ నలుగురి ఆచూకీ గల్లంతయింది. అడవిలో అజ్ఞాతంలోనే అదృశ్యమైన వారి కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. ‘మావో’ళ్లు ఇంటికి వస్తారా.. అనే అంతులేని ప్రశ్నలు ఆ కుటుంబాలను వేధిస్తున్నాయి.

ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లికి చెందిన తుమ్మల శ్రీనివాస్‌ అలియాస్‌ విశ్వనాథ్‌ సిద్దిపేటలో డిగ్రీ చదువుతూ 1998లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. చదువులో చురుగ్గా ఉండే శ్రీనివాస్‌ సిద్దిపేటలో చదువుతూనే అడవి బాట పట్టినట్లు భావిస్తున్నారు. 28 ఏళ్లుగా అతడి జాడతెలియక కుటుంబ సభ్యులు తల్లడిల్లిపోతున్నారు. అతని తల్లిదండ్రులు తుమ్మల(మ్యాదరి) నారాయణ గతేడాది మరణించగా, తల్లి భూదమ్మ తొమ్మిదేళ్ల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులు మరణించినా కడసారి చూపులకు సైతం శ్రీనివాస్‌ రాకపోవడం విషాదం.

నాలుగు దశాబ్దాలుగా ఉద్యమంలోనే..

జిల్లాలోని కోనరావుపేట మండలం ధర్మారంకు చెందిన బండి చంద్రయ్య అలియాస్‌ మహేశ్‌ నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నారు. పదో తరగతి వరకు ధర్మారంలోనే చదువుకున్న ఆయన 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. అతడి తల్లిదండ్రులు ఎల్లవ్వ, లింగయ్యకు ముగ్గురు కొడుకులు నాంపల్లి, శంకరయ్య, చంద్రయ్య, ఒక కూతురు శాంతమ్మ. చిన్నోడు చంద్రయ్య అడవిబాట పట్టారు. అతని కోసం కుటుంబ సభ్యులు వెతికి విసిగిపోయారు. చిన్నకొడుకు తలపుల్లో తల్లిదండ్రులు అనారోగ్యంతో మరణించారు. మరో సొదరుడు శంకరయ్య అనారోగ్యంతో పదేళ్ల క్రితం మృతిచెందాడు. తల్లిదండ్రులు, సోదరుడు మరణించినా చంద్రయ్య ఇల్లు ముఖం చూడలేదు. ప్రస్తుతం పెద్దన్న నాంపల్లి, వదినె దేవవ్వ ధర్మారంలో ఉన్నారు. 40 ఏళ్లుగా మహేశ్‌ పేరుతో మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నాడు. చంద్రయ్య ఆచూకీ తెలియక కుటుంబ సభ్యులు దిక్కులు చూస్తున్నారు.

చందుర్తి నుంచి దండకారణ్యం

చందుర్తి మండల కేంద్రానికి చెందిన బత్తుల కాంతారావు అలియాస్‌ నవీన్‌ 30 ఏళ్ల క్రితం అజ్ఞాతంలోకి వెళ్లాడు. చాలా కాలం మావోయిస్టు పార్టీలో కొరియర్‌గా పని చేసిన నవీన్‌ దండకారణ్యంలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే దండకారణ్యంలో సాయుధ నక్సలైట్లు ఆయుధాలు అప్పగించి లొంగిపోయారు. కాంతారావు అలియాస్‌ నవీన్‌ ఐదేళ్ల క్రితం ఒడిశాకు వెళ్లినట్లు సమాచారం. కాంతారావు ఆచూకీ 30 ఏళ్లుగా లేక పోవడంతో కుటుంబ సభ్యులు అతను ఎక్కడ ఉన్నాడు.. ఎలా ఉన్నాడోనని అయోమయానికి గురవుతున్నారు.

అజ్ఞాతంలోనే అదృశ్యం

జిల్లాలోని తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటకు చెందిన చిన్నన్న అలియాస్‌ బాలసంతుల ఉప్పలయ్య మూడు దశాబ్దాల కిందటే అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు. ఆయన సిరిసిల్ల ప్రాంతంలో చిన్నన్న పేరుతో పని చేస్తూ పార్టీ డబ్బులతో పార్టీని వీడి పారిపోయినట్లు ప్రచారం జరిగినా ఇప్పటికీ ఆయన ఎక్కడ ఉన్నది ఎవరకీ తెలియదు. అజ్ఞాతంలోనే అదృశ్యమయ్యాడు.

పోలీస్‌ రికార్డుల్లో కనిపించని ఆ పేర్లు

రాష్ట్ర పోలీస్‌ ఉన్నతాధికారులు ఇటీవల అజ్ఞాతంలో ఉన్న వారి పేర్లను ప్రకటించారు. కానీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఆ నలుగురు అజ్ఞాత వాసుల పేర్లు ఆ జాబితాలో లేవు. జిల్లాకు చెందిన విశ్వనాథ్‌ (శ్రీనివాస్‌), బండి చంద్రయ్య(మహేశ్‌), బత్తుల కాంతయ్య(నవీన్‌), చిన్నన్న(ఉప్పలయ్య) పేర్లు లేవు. వారంతా ఎక్కడ ఉన్నారో, ఎలా ఉన్నారో ఎవరికీ తెలియదు. వారి ఆచూకీపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత అటు మావోయిస్టు పార్టీ, లేదా పోలీస్‌ నిఘా విభాగంపై ఉంది.

‘ఎన్‌కౌంటర్‌’ సినిమాలోని ఈ పాట.. ఎదిగిన కొడుకు చదువు కోసం పట్నం వెళ్లి కనిపించకుండా పోవడంతో కొడుకు తలపుల్లో తల్లిపడిన వేదనకు అద్దం పడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement