ఉత్తమ సేవలు అందించాలి
● రూ.51.21 కోట్ల బడ్జెట్‌కు పచ్చజెండా ● మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి ● మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ ● సిరిసిల్ల కౌన్సిల్ బడ్జెట్ సమావేశం
సిరిసిల్లటౌన్: అభివృద్ధే ప్రధాన ఎజెండాగా బడ్జెట్ రూపొందించినట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ అన్నారు. మున్సిపల్ కౌన్సిల్ హాల్‌లో మంగళవారం ఆమె అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశం అనంతరం ప్రెస్‌మీట్‌లో సమావేశం వివరాలను వెల్లడించారు. పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యం మున్సిపల్ కౌన్సిల్ సకల చర్యలు తీసుకుంటుందన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 51.21కోట్లు బడ్జెట్ రూపొందించినట్లు వెల్లడించారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు, పారిశుధ్య, వీధి దీపాల, మంచినీటి సరఫరా నిర్వహణకు నిధులు కేటాయించినట్లు తెలిపారు. పూర్తి బడ్జెట్‌లో 10శాతం హరితహారంకు కేటాయించామన్నారు. విలీన, అభివృద్ధి చెందని, మురికివాడల ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు 1/3వంతు నిధులు కేటాయిస్తూ కౌన్సిల్ ఆమోదించిందని తెలిపారు. కౌన్సిల్ సమావేశానికి హాజరైన కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు పూలమొక్క అందించి ఆహ్వానం పలికారు.
సాధారణ సమావేశంలో వాగ్వాదం
బడ్జెట్ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం మార్చి నెలకు సంబంధించిన మున్సిపల్ సాధారణ సమావేశాన్ని నిర్వహించగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం నెలకొంది. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ మాట్లాడుతూ సీఎం ఫొటోలు కౌన్సిల్ హాల్, చైర్‌పర్సన్ చాంబర్‌లో ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రొటోకాల్ పాటించాలని గతనెల సమావేశంలో సూచించినా పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలకు మీడియాను ఖచ్చితంగా అనుమతించాలని అన్నారు. అనంతరం ప్రెస్‌మీట్‌లో చైర్‌పర్సన్ జిందం కళ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా మంచినీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా, వచ్చే వర్షాకాలం ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన మురికి కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించడం, ఓపెన్ జిమ్‌ల మరమ్మతు తదితర మౌలిక అవసరాలపై 21 అంశాలతో కూడిన ఎజెండాపై పాలకవర్గ సభ్యులందరితో చర్చించి ఆమోదించినట్లు వివరించారు. సమావేశంలలో మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖాదిర్ ఫాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
కొత్తగా ఎన్నికై న కౌన్సిలర్లు ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన బడ్జెట్ సమావేశానికి హాజరై మాట్లాడారు. రెవెన్యూ వ్యయంలో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కరెంట్ బిల్లులు, రుణాల చెల్లింపు, పారిశుధ్య ప నులకు చెల్లింపులు, ఇతర ఖర్చులు ఉంటాయని, తప్పనిసరిగా 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని సూచించారు. మున్సిపల్‌కు రావాల్సిన పన్నులు 100 శాతం వసూలు చేయడంతో ప్రభు త్వ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తే 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు అవుతాయని వెల్లడించారు. ఖాళీగా ఉన్న మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ గదులు అద్దెకు ఇచ్చేందుకు మరోసారి టెండర్లు పిలువాలని ఆదేశించారు. కొత్త చెరువులో మరమ్మతు పనులు చేయించి, ప్రజలు, పిల్లలు వచ్చేలా తీర్చిదిద్దాలని ఆదేశించారు.


