సత్వర విద్యుత్ సేవలు అందిస్తాం
‘సెస్’లో ఎన్పీడీసీఎల్ విధానాల అమలుకు ఆదేశాలు
వేగంగా మారిన పరిణామాలు
‘సెస్’ లైసెన్స్ రెన్యూవల్‌పై అనుమానాలు
హడావుడి
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) ఆఫీస్ వద్ద బుధవారం హడావుడి.. అయోమయం నెలకొంది. నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్(ఎన్పీడీసీఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి తన సిబ్బంది, పోలీసులతో ‘సెస్’ ఆఫీస్‌కు చేరుకున్నారు. ‘సెస్’ ఎండీ భిక్షపతి, డీఈఈలతో సమావేశమయ్యారు. టీజీఈఆర్‌సీ ఆదేశాలతో ‘సెస్’ పరిధిలో విద్యుత్ సేవలను ఎన్పీడీసీఎల్ చూస్తుందని, ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ విధానం కొనసాగుతోందని స్పష్టం చేశారు.
అమలులోకి ఎన్పీడీసీఎల్ విధానాలు
ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఏప్రిల్, మే నెలలకు సమాయత్తం కావాలని ఆదేశించారు. ఓవర్‌లోడ్ ఉన్న 11 కేవీ ఫీడర్లు, ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచాలని, ఒకే బ్రేకర్‌పై ఉన్న రెండు ఫీడర్లను అదనపు బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న 2,491 సర్వీసులను మంజూరు చేయాలని, ఎన్పీడీసీఎల్ విధానం అమలు చేయాలని స్పష్టం చేశారు. ఒక్క కిలోవాట్‌కు రూ.1000 మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. విద్యుత్ సిబ్బంది భద్రతకు భరోసా కల్పించే ఎన్పీడీసీఎల్ పరిధిలో అమలవుతున్న రూ.కోటి ప్రమాదబీమా ‘సెస్’ ఉద్యోగులకూ అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, సర్వీసుల మంజూరు మీసేవ కేంద్రాలు, గ్రామాల్లోని కామన్ సర్వీస్ సెంటర్‌ల ద్వారా అమలు చేయాలన్నారు. ఈ నెల జీతభత్యాలు సైతం ‘సెస్’ సిబ్బందికి ఎన్‌పీడీసీఎల్ చెల్లిస్తుందని, పెండింగ్‌లో ఉన్న బకాయిలు ఇస్తామని సీఎండీ స్పష్టం చేశారు. ఎన్పీడీసీఎల్ ఆపరేషన్స్ సీఈ ప్రభాకర్, సీఈలు కిషన్, బుస్సా అశోక్, కరీంనగర్ ఎస్‌ఈ రవీందర్ ఉన్నారు.
పోలీస్ వలయంలో ‘సెస్’ ఆఫీస్
ఎన్పీడీసీఎల్ అధికారులు సిరిసిల్లకు రాగానే వారి ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ, ఎస్సై, సిబ్బందితోపాటు సిరిసిల్ల ఏఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రచారి, స్థానిక పోలీసులతో బందోబస్తు చేపట్టారు. ‘సెస్’ పాలకవర్గం నుంచి ప్రతిఘటన ఉంటుందనే అనుమానంతో ముందస్తు సమాచారం లేకుండానే వచ్చారు.
ఇదీ ‘సెస్’ లైసెన్స్ కథ
సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్) సంస్థకు ఐదేళ్లకోసారి రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఈఆర్‌సీ) లైసెన్స్‌ను రెన్యూవల్ చేస్తుంది. 2021లో జారీచేసిన లైసెన్స్ గడువు 2026 మార్చి 31తో ముగిసిపోయింది. ‘సెస్’ పాలకవర్గం ఎండీ ద్వారా 2025 డిసెంబరులో లైసెన్స్ రెన్యూవల్ కోసం ప్రతిపాదనలు పంపించారు. కానీ ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో గడువు మంగళవారంతో తీరిపోయింది. దీంతో ఎన్‌పీడీసీఎల్ అధికారులు ‘సెస్’ సంస్థను స్వాధీనం చేసుకున్నారు.
ఎందుకు ఇలా..
‘సెస్’లో అవినీతి ఉందని, పాలకవర్గం ఎన్నికల సమయంలో అక్రమాలు జరిగాయనే అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సెస్ పాలకవర్గంలో బీఆర్‌ఎస్ నాయకులే ఉండడంతో ఈ చర్యలకు దిగినట్లు విమర్శలు ఉన్నాయి. ‘సెస్’ లైసెన్స్ రెన్యూవల్ కోసం ఇటీవల సిరిసిల్ల ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిప్యూటీ సీఎం మల్లు విక్రమార్క భట్టి, సహకారశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును కలిసి విన్నవించారు. కానీ ముందే నిర్ణయించిన ప్రకారం ‘సెస్’ లైసెన్స్‌ను రెన్యూవల్ చేయలేదని భావిస్తున్నారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా సత్వర సేవలు అందిస్తాం. ఎన్పీడీసీఎల్ విధానాలు అమలు చేస్తాం. ఒకే విధమైన ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయి. అవినీతి రహితంగా సేవలు ఉంటాయి. ఉద్యోగులకు ప్రమాదబీమా ఉంటుంది. టీఈఆర్‌సీ ఆదేశాలు వచ్చే వరకు ‘సెస్’ పరిధిలో ఎన్పీడీసీఎల్ సేవలు అందుతాయి.
– కర్నాటి వరుణ్‌రెడ్డి, సీఎండీ, ఎన్పీడీసీఎల్


