నా కొడుకును స్వగ్రామానికి రప్పించండి
బోయినపల్లి(చొప్పదండి): ఉపాధి కోసం సౌదీఅరేబియాకు వెళ్లి ఏజెంట్ మోసంతో అక్కడి జైలులో మగ్గుతున్న తన కొడుకు కమటం వెంకటేశంను విడిపించాలని రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూర్గుపల్లికి చెందిన కాంతవ్వ ఎస్పీ మహేశ్ బీ గీతేను కోరింది. బూర్గుపల్లికి చెందిన వెంకటేశ్‌కు ఉద్యోగం ఇప్పిస్తానని ఏజెంట్ నమ్మబలికి సౌదీఅరేబియాకు పంపాడని తెలిపింది. పక్కా పని చూపకుండా రహస్యంగా చేసే పని చూపడంతో పోలీసులు అరెస్ట్ చేసి జైలులో వేశారని కాంతవ్వ వాపోయింది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందించినట్లు తెలిపింది. ఈక్రమంలో బక్కి వెంకటయ్య రాసిన లేఖను ఎస్పీకి అందచేశామంది. ఏజెంట్ శేఖర్‌తోపాటు అతనికి సహకరిస్తున్న పెద్ద మనుషులపై చర్యలు తీసుకోవాలని కాంతవ్వ కోరింది. రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు తడగొండ సత్యరాజ్‌వర్మ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు తడగొండ నర్సింగ్‌బాబు ఉన్నారు.


