గాలికొదిలేసిన పనులను గాడిలో పెట్టాం
● ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పదేళ్ల పాలనలో గాలికి ఒదిలేసిన పనులను తాము రెండేళ్లలో గాడిలో పెట్టామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడను టెంపుల్ సిటీగా మార్చేందుకు ఇప్పటికే కోట్ల రూపాయలు వెచ్చించినట్లు తెలిపారు. స్థానిక ఎస్‌ఆర్‌ఆర్ గార్డెన్‌లో ఆదివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడారు. ఈనెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కోరారు. పార్టీ సూచించిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలన్నారు. గతంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌లకు అవకాశం ఇస్తే అభివృద్ధిని విస్మరించారన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వేములవాడలో చేసిన అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలని పట్టణ ప్రజలను కోరారు. రూ.10కోట్లతో మూలవాగులో గుడి చెరువులో డ్రెయినేజీ నీరు కలవకుండా పనులు చేస్తున్నామన్నారు. డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్, 28 వార్డుల అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


