అమ్మలేదు.. ఆదుకునే నాన్నలేడు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): గోరుముద్దలు తినిపించే అమ్మలేదు.. ఆటాపాటలతో సంతోషాన్నిచ్చే నాన్నలేడు.. అనారోగ్యం రూపంలో వచ్చిన మృత్యువు దంపతులిద్దరినీ కబళించడంతో వారి ఇద్దరు కూతుళ్లు ఏ దిక్కూలేక అనాథలయ్యారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఇదులాపూర్ గ్రామంలో ఈ దయనీమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. అక్కల సదయ్య(35)– శ్యామల దంపతులు. వీరిది పేదకుటుంబం. సదయ్య ఊరులో పశువుల కాపరిగా పనిచేస్తున్నాడు. ఉన్నంతలో తమ ముగ్గురు కూతుళ్లను పోషించుకుంటున్నారు. కొంతకాలం క్రితం పెద్దకూతురు వివాహం జరిపించి అత్తారింటికి పంపించారు. విధివక్రీకరించింది.. అనారోగ్యానికి గురైన శ్యామల రెండేళ్ల క్రితం మృతి చెందింది. అయినా, తన ఇద్దరు కూతుళ్లు అక్షయ, అక్షితను పోషించుకుంటున్న సదయ్య.. అకస్మాత్తుగా ఆయన కూడా అనారోగ్యానికి గురయ్యాడు. ఈక్రమంలోనే బుధవారం చనిపోయాడు. తండ్రి శవం వద్ద బిక్కుబిక్కుమంటున్న కూర్చున్నారు వారి చిన్నకూతుళ్లు అక్షయ, అక్షిత. ఏం చేయాలో కూడా తెలియని స్థితివారిది. బాలికలను చూసిన గ్రామస్తులు అయ్యా పాపం అంటూ చలించిపోయారు. అంత్యక్రియల ఎలా జరపాలని ఊరోళ్లే ఆలోచన చేశారు. ఊరంతా తలోకొంత డబ్బుపోగు చేసుకున్నారు. సదయ్య అంత్యక్రియలు పూర్తిచేసి మానత్వం చాటుకున్నారు. తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వారిని ప్రభుత్వమే ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
నాడు తల్లి, నేడు తండ్రి మృతి
అనాథలైన చిన్నారులు
దయనీయ స్థితిలో బాలికలు
చందాలు వేసుకుని అంత్యక్రియలు
మానవత్వం చూపిన ఇదులాపూర్ గ్రామస్తులు
అమ్మలేదు.. ఆదుకునే నాన్నలేడు


