నీళ్లు లేవు.. నీడ లేదు
మున్సిపల్ గేటు మూసి హెల్ప్‌డెస్క్ ఏర్పాటు
రోడ్డుపైనే ఎండలోనే అభ్యర్థుల క్యూలైన్
హెల్ప్‌డెస్క్ వద్ద రోడ్డుపైనే క్యూలైన్‌లో అభ్యర్థులు
గాంధీచౌక్‌లో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు
సిరిసిల్ల: జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేసిన ఏర్పాట్లు అభాసుపాలవుతున్నాయి. మున్సిపల్ ఆఫీస్ గేట్లను మూసివేసి గేటు వద్దనే హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. నామినేషన్ పత్రాల కోసం వచ్చిన అభ్యర్థులకు నీడ కరువైంది. రోడ్డుపైనే క్యూలో నిల్చొని నామినేషన్ పత్రాలు స్వీకరించారు. గేటు వద్దనే హెల్ప్‌డెస్క్ అని బోర్డు పెట్టి, కనీసం టెంట్ కూడా వేయలేదు. నీళ్లు లేవు.. నిలబడేందుకు నీడ లేదు. నామినేషన్ల స్వీకరణకు కనీస ఏర్పాట్లు చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వచ్చాయి. మున్సిపల్ అధికారులు ఇప్పటికై నా ఏర్పాట్లను సమీక్షించి మెరుగైన వసతి కల్పించాల్సిన అవసరం ఉంది.
రోడ్లపై పోలీసులు ఆంక్షలు
పట్టణ ప్రజల సహనానికి పోలీసులు పరీక్ష పెట్టారు. నామినేషన్ల ప్రక్రియ సాగుతుండగా పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారిని మూసివేశారు. గాంధీచౌక్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు ఒక్క వైపు రోడ్డును బారికేడ్లతో మూసివేశారు. దీంతో ఒకే వైపు నుంచి వాహనాలు వెళ్లడంతో రద్దీగా మారింది. మున్సిపల్ ముందు ట్రాఫిక్ కష్టాలు ఎదురయ్యాయి. సిరిసిల్ల డీఎస్పీ కె.నాగేంద్రచారి, పట్టణ సీఐ కె.కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, గణేశ్, అశోక్‌కుమార్, ముళీధర్‌గౌడ్, ట్రాఫిక్ ఎస్సై దిలీప్ భద్రత ఏర్పాట్లు పర్యవేక్షించారు.
నీళ్లు లేవు.. నీడ లేదు


