హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలి
● వరంగల్– కరీంనగర్ ప్రధాన రహదారిపై నిరసన
హుజూరాబాద్: హుజూరాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలనే ఉద్యమం మళ్లీ రాజుకుంది. జిల్లా సాధన జేఏసీ పిలుపు మేరకు మంగళవారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బస్సు డిపో చౌరస్తాలోని కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుంచి భారీ ర్యాలీ తీశారు. శ్రీహుజూరాబాద్ జిల్లా– మన హక్కుశ్రీ అంటూ నినదించారు. అనంతరం కరీంనగర్– వరంగల్ ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టారు. జిల్లా సాధన జేఏసీ కన్వీనర్ భీమోద్ సదానందం మాట్లాడుతూ అన్ని అర్హతలున్న హుజూరాబాద్‌ను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రక్షాళన చేపట్టనున్న నేపథ్యంలో హుజురాబాద్‌ను జిల్లాగా ప్రకటించాలని, పీవీ నరసింహారావు పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సుమారు రెండు గంటల పాటు రహదారిపై ఆందోళన నిర్వహించడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. టౌన్ సీఐ కరుణాకర్ ఆందోళనకారులతో మాట్లాడి విరమింపజేశారు.


