నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేయండి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్ కార్యాలయాల్లో నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్‌ను సందర్శించి నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ల స్వీకరణ కౌంటర్లు, సౌకర్యాలపై మున్సిపల్ కమిషనర్ ఖదీర్‌పాషాను అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు కలగకుండా సూచిక బోర్డులు, ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఎన్నికల కోడ్ అమలు చేయాలి
రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా అధికారులు పని చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, రిటర్నింగ్ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫ్లెక్సీలు, హోర్డింగులు, చిత్రపటాలు, శిలాఫలకాలు మూసివేయాలని సూచించారు. నామినేషన్లకు సంబంధించిన నోటిఫికేషన్ ను బుధవారం ఉదయం విడుదల చేయాలని కలెక్టర్ కోరారు. ఉదయం 10.30 గంటల నుంచి సా యంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరించాలని ఆదేశించారు. కేంద్రంలోకి అభ్యర్థితో పాటు ఇద్దరికీ అనుమతి ఉంటుందని వెల్లడించారు.
విధులపై పూర్తి అవగాహన ఉండాలి
మున్సిపల్ ఎన్నికల నోడల్ అధికారులు తమ విధులపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని కలెక్టర గరీమా అగ్రవాల్ అదేశించారు. కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర గడ్డం నగేశ్‌తో కలిసి నోడల్ అధికారులతో సమీక్షించారు. ఎన్నికల నిబంధనలు సమగ్రంగా చదివి అర్థం చేసుకోవాలని సూచించారు. ఏఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, మున్సిపల్ కమిషనర్లు ఖదీర్‌పాషా, సంపత్‌కుమార్, నోడల్ అధికారులు గీత, లక్ష్మణ్, శ్రీనివాసాచారి, జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్, ప్రవీణ్, అన్సార్, మీర్జా ఫసహత్ అలీ బేగ్, శ్రీనివాస్, భారతి, మల్లికార్జునరావు, షరీఫోద్దీన్ తదితరులు పాల్గొన్నారు.


