● విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరాలని, ప్రజాపాలనతోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని పాలిస్టర్ అసోసియేషన్ భవన్, ఎస్ కన్వెన్షన్‌లో మంగళవారం పలువురు వస్త్రవ్యాపారులు, పద్మశాలీ సంఘం ప్రతినిధులు కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ, సిరిసిల్ల వస్త్రపరిశ్రమకు ప్రభుత్వం ద్వారా వస్త్రోత్పత్తి ఆర్డర్లు అందిస్తున్నామని, గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన రూ.200 కోట్ల బకాయిలు విడుదల చేశామన్నారు. రూ.50కోట్లతో నూలు డిపో ఏర్పాటు చేసి నూలును అందిస్తున్నామని వివరించారు. భవిష్యత్‌లోనూ ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. పద్మశాలీ సంఘం పట్టణ అధ్యక్షుడు దూడం శంకర్, ప్రధాన కార్యదర్శి మండల సత్యం, మాజీ కౌన్సిలర్లు వెల్దండి దేవదాస్, దూస వినయ్, గౌడ రాజు కాంగ్రెస్‌లో చేరారు. గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపా తిరుపతిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆడెపు భాస్కర్, కార్యదర్శి ఆంకాలపు రవి తదితరులు పాల్గొన్నారు.


