వనదేవతలు.. జనజాతరలు
సమ్మక్క–సారలమ్మ గద్దెలు ముస్తాబు
నిధులివ్వని సర్కారు.. విరాళాలతో నిర్వహణ
28 నుంచి 31 వరకు జాతరలు
సిరిసిల్ల: వనదేవతల జాతరకు వేళైంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క–సారలమ్మ జాతరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గద్దెలు ముస్తాబవుతున్నాయి. వేడుకల నిర్వహణకు ప్రభుత్వ పరంగా నిధులు మంజూరు కాలేదు. ఫలితంగా స్థానికసంస్థలు, ఆలయ కమిటీలు విరాళాలు సేకరిస్తున్నాయి. ములుగు జిల్లా మేడారం సమ్మక్క–సారలమ్మ తరహాలోనే జిల్లాలోనూ మూడు దశాబ్దాలుగా జాతర వేడుకలు సాగుతున్నాయి. ముచ్చటైన నాలుగు రోజుల పండగను జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో అమ్మవార్ల గద్దెలపై ప్రత్యేక కథనం.
శాంతినగర్‌లో 50 ఏళ్లుగా..
వీర్నపల్లి మండలం వన్‌పల్లి శివారులోని శాంతినగర్ బానోత్ గిరిజనతండాలో 50 ఏళ్లుగా సమ్మక్క–సారలమ్మ జాతర కొనసాగుతోంది. అడవి ఒడిలో సాగే ఈ జాతర శ్రీగిరిశ్రీపుత్రులకు ఉత్సాహాన్ని ఇస్తుంది. పొరుగునే ఉన్న నిజామాబాద్ జిల్లా నుంచి గిరిజనులు ఎక్కువగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎల్లారెడ్డిపేట నుంచి వీర్నపల్లి మీదుగా 36 కిలోమీటర్లు ప్రయాణిస్తే శాంతినగర్ తండా చేరుకోవచ్చు. వేములవాడ నుంచి వట్టిమల్ల, మరిమడ్ల, తాటిపల్లి మీదుగా సమ్మక్క గద్దెల వద్దకు చేరుకోవచ్చు. బస్సు, ఆటో సౌకర్యం ఉంటుంది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, బాబాయి తండా, ఇల్లంతకుంట మండల కేంద్రం, కోనరావుపేట మండలం శివంగాళపల్లి గ్రామాల్లోనూ సమ్మక్క–సారలమ్మ జాతర సాగుతుంది.
మౌలిక వసతులే సమస్య
జాతర జరిగే ప్రాంతాల్లో వసతులు సమస్యగా మా రింది. ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేయకపోవడంతో తాగునీటి వసతి, పారిశుధ్యం, టాయిలెట్లు, వీధిదీపాలు వంటివి ఏర్పాటు చేయడం నిర్వాహకులకు ఇబ్బందిగా మారింది. నిధులు అందుబాటులో లేక వసతులకు ఇబ్బందిగా ఉంది.
28న గద్దెలపైకి అమ్మవార్లు
ఈనెల 28న సారలమ్మ, గోవిందరాజులు, పగిడిద్దరాజు గద్దెకు చేరుకుంటారు. 29న కుంకుమ భరిణే రూపంలో సమ్మక్క తల్లి గద్దెకు చేరుకోవడంతో జాతర ప్రారంభమవుతుంది. 30న భక్తులు అమ్మవార్లకు ఒడిబియ్యం సమర్పించడం, బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. 31న అమ్మవార్లు వనప్రవేశంతో జాతర ముగుస్తుంది.
మినీమేడారం ఓబులాపూర్
తంగళ్లపల్లి మండలం ఓబులాపూర్ నాలుగు రోజులపాటు జనసంద్రమవుతుంది. సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల నుంచే కాకుండా మహారాష్ట్రలోని ముంబయి, భీవండి, షోలాపూర్, హైదరాబాద్ వంటి పట్టణాల నుంచి వేలాది మంది భక్తులు ఓబులాపూర్ సమ్మక్క గద్దెలకు చేరుకుని మొక్కులు తీర్చుకుంటారు. వనదేవతలకు నిలువెత్తు బంగారం(బెల్లం) సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. ఓబులాపూర్ శివారులో విడిది పొంది అమ్మలకు పూజలు చేస్తారు. 44 ఏళ్లుగా ప్రతీ రెండేళ్లకోసారి అత్యంత వైభవంగా సమ్మక్క, సారలమ్మ జాతర సాగుతుంది. గతంలో అప్పటి రాష్ట్ర మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో ఆలయ అభివృద్ధికి గిరిజనశాఖ నుంచి రూ.9.50 లక్షలు మంజూరు చేయగా అమ్మవారి గద్దెలు నిర్మించారు. అనంతరం ఎలాంటి నిధులు మంజూరుకాలేదు.
వనదేవతలు.. జనజాతరలు
వనదేవతలు.. జనజాతరలు


