వన్యప్రాణుల గణన
● అటవీబాట పట్టిన ఫారెస్ట్ అధికారులు ● దేశవ్యాప్తంగా లెక్కలు తీస్తున్న కేంద్రం ● నాలుగేళ్లకోసారి వివరాలు సేకరణ ● ఏఐటీఈలో భాగంగా సర్వే ● సర్వేకు ఆటంకంగా ఖాళీలు
అడవి విస్తీర్ణం : 39,006 హెక్టార్లు
సెక్షన్లు : 13, బీట్లు : 41
బీట్ అధికారి పోస్టుల ఖాళీలు : 22
సెక్షన్ అధికారి పోస్టు ఖాళీ : 01
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): పెద్దపులి.. చిరుతలు.. ఎలుగుబంటి.. దుప్పులు.. కొండగొర్రెలు.. కుందేళ్ల లెక్కలు తేలనున్నాయి. అడవినే ఆవాసంగా చేసుకున్న వన్యప్రాణుల లెక్కలు తీసేందుకు ఫారెస్ట్ అధికారులు అడవిబాట పట్టారు. ఏటా నాలుగేళ్లకోసారి దేశవ్యాప్తంగా చేపట్టే ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్(ఏఐటీఈ) సర్వే జిల్లాలో ఇప్పటికే మొదలైంది. ఇక నుంచి జిల్లాలోని అడవిలో ఏయే జంతువులు ఎంత మొత్తంలో ఉన్నాయో తేలనుంది.
ఆరు రోజులు.. 4 కిలోమీటర్లు
రాజన్నసిరిసిల్ల జిల్లాలో 39,006 హెక్టార్లలో అడవి విస్తరించి ఉంది. ఈ ప్రాంతంలో వన్యప్రాణుల లెక్క తేల్చేందుకు ఫారెస్ట్ అధికారులు ఆరు రోజు లు వివరాలు సేకరించారు. నిత్యం నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఏయే జంతువులు సంచరిస్తున్నాయో వివరాలను యాప్‌లో నమోదు చేశారు. మొదటి మూడు రోజులు మాంసాహార జంతువులు, మిగతా మూడు రోజుల్లో శాఖాహార జంతువుల లెక్కలు తీశారు. ఇప్పటికే జిల్లాలో ఆరు రోజులు అడవిలో తిరిగి జంతువుల వివరాలు సేకరించారు. ఇందుకు ఒక్కో బీట్‌కు ఒక్కో టీమ్ సర్వే చేసింది. సిరిసిల్ల పరిధిలో 20 బీట్లలో 20 బృందాలు, వేములవాడ పరిధిలోని 21 బీట్లలో 21 బృందాలు జంతువుల వివరాలు సేకరించాయి. వీరంతా ఉదయం 5 గంటలకే అడవిలోకి వెళ్లి ఉదయం 10 గంటల వరకు వన్యప్రాణుల ఆనవాళ్లు సేకరించారు. ఇలా సేకరించిన వివరాలను కేంద్రం తయారు చేసిన యాప్‌లో అప్‌లోడ్ చేశారు.
ఖాళీలతో ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా సిరిసిల్ల, వేములవాడ రేంజ్‌ల పరిధిలో 22 బీట్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీకి ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం నుంచి భర్తీ చేయడం లేదు. ప్రైవేట్ వ్యక్తులకు శిక్షణ ఇచ్చినప్పటికీ వాలంటీర్లుగా పనిచేయాల్సి రావడంతో ఎవరూ ఆసక్తి చూపడం లేదు. అంతేకాకుండా తెల్లవారుజామునే అటవీ బాట పట్టాల్సి రావడం.. వన్యప్రాణుల నుంచి ముప్పు ఉంటుందని భయపడి స్వచ్ఛందంగా జంతుగణనకు ఎవరూ ముందుకురావడం లేదు. ప్రభుత్వం చేపడుతున్న ఇలాంటి సర్వేలతోపాటు వన్యప్రాణుల రక్షణ, అటవిసంపదను కాపాడేచర్యల్లో అరకొరగా ఉండే ఫారెస్ట్ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారు.


