ఎస్సారెస్పీ కాలువలో యువకుడి గల్లంతు
శంకరపట్నం: మండలంలోని కరీంపేట గ్రామంలో ఆదివారం ఎస్సారెస్పీ కాలువలో సాదుల అనిల్(21) గల్లంతయ్యాడు. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. కరీంపేటకు చెందిన సాదుల రాజయ్య–స్వరూప దంపతులకు అనిల్ ఒక్కడే కుమారుడు. కేశవపట్నంలో బైక్ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. తమకున్న కొద్దిపాటి పొలంలో మహారాష్ట్రకు చెందిన కూలీలతో ఆదివారం వరినాటు వేయించాడు. దుక్కిలో ఎరువు చల్లిన అనిల్ గ్రామంలోని ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు మెట్లపై నుంచి కాలువలోకి దిగాడు. నీరు ఉధృతంగా ప్రవహించడంతో నీటిలో గల్లంతయ్యాడు. కాలువ వెంట గ్రామస్తులు గాలింపు చేపట్టారు. ఒక్కగానొక్క కొడుకు కాలువలో గల్లంతు కావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్సై శేఖర్‌రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
షార్ట్ సర్క్యూట్‌తో కిరాణంషాపులో మంటలు
మల్యాల: మండలంలోని నూకపల్లి డబుల్‌బెడ్‌రూం కాలనీలోని కిరాణ దుకాణంలో షార్ట్ సర్క్యూట్‌లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. కాలనీలోని పాలిక కమలాకర్ తన షాపును శనివారం రాత్రి మూసి ఇంటికెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి కమలాకర్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల విలువైన కిరాణ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌కుమార్ తెలిపారు.


