ఓటుహక్కు అందరి బాధ్యత
● అమ్మాయిలు ఆకాశమే హద్దుగా ఎదగాలి ● కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ‘మై ఇండియా.. మై ఓట్’ అనే థీమ్‌తో 16వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటు ప్రతిజ్ఞ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ నమోదు, ఎథికల్ ఓటింగ్‌పై అవగాహన కల్పించేందుకు ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ దినోత్సవంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్కువ సార్లు ఓటు హక్కు వినియోగించుకున్న సీనియర్ ఓటర్లకు సన్మానం చేశారు. నూతనంగా ఓటుహక్కు వచ్చిన యువ ఓటర్లకు ఎపిక్ కార్డులు అందజేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయ్, సీపీవో శ్రీనివాసాచారి పాల్గొన్నారు.
ఉన్నతంగా ఎదగాలి
బాలికలు అన్ని రంగాల్లో రాణించి, ఉన్నత స్థానాలకు ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఫ్లెక్సీపై బాలికలను ఉద్దేశించి ‘స్కై ఈజ్ ద లిమిట్’ అని రాశారు. జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాస రచన, డ్రాయింగ్, ఉపన్యాస పోటీల్లోని విజేతలకు బహుమతులు అందించారు. మారుమూల ప్రాంతాల్లో పుట్టిన రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, మేరికోమ్ కష్టాలను అధిగమించి ఎలా ఉన్నతస్థానాలకు చేరుకున్నారో చెప్పి వారిలో స్ఫూర్తి నింపారు.
ఇరా సింఘాల్ 62 శాతం వైకల్యం ఉన్నా 2014 యూపీఎస్సీ పరీక్షల్లో ఆలిండియా ర్యాంక్ సాధించి,..ఐఏఎస్‌గా సేవలు అందిస్తున్న విషయాన్ని విద్యార్థినులకు తెలిపారు. ప్రణాళిక ప్రకారం చదివి.. ఉన్నత స్థానాలకు ఎదగాలని హితబోధ చేశారు. జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం పాల్గొన్నారు.
ఓటు వజ్రాయుధం
సిరిసిల్లక్రైం: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుధమని, ప్రతీ పౌరుడు తన ఓటుహక్కును వినియోగించుకోవడం బాధ్యత అని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం జిల్లా పోలీసు ఆఫీస్‌లో ప్రతిజ్ఞ చేశారు. అదనపు ఎస్పీ చంద్రయ్య, సీఐలు రవి, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు మధుకర్, యాదగిరి పాల్గొన్నారు.


