ఫోన్‌ట్యాపింగ్‌పై కేటీఆర్ నాటకం ఆడుతున్నారు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే సత్యం
వేములవాడ: ఫోన్‌ట్యాపింగ్ కేసుపై రాష్ట్రమంతా కోడై కూస్తుంటే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాత్రం నాటకం ఆడుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం మండిపడ్డారు. వేములవాడలో శనివారం విలేకరులతో మాట్లాడారు. సినీతారలు, జడ్జీలు, వ్యాపారులు, నాయకుల ఫోన్‌లు ట్యాపింగ్ చేసి అక్రమార్జనకు పాల్పడ్డారని ఆరోపించారు. ఆనాటి పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఫోన్‌ను ట్యాపింగ్ చేసి రాజకీయంగా ఇబ్బందులు పెట్టారన్నారు. డ్రోన్ సంబంధిత విషయంలో 14 రోజులు ఉగ్రవాదులు ఉండే బ్యారక్‌లో వేసి మానసికంగా ఆనందం పొందారని మండిపడ్డారు. ట్యాపింగ్ జరగలేదనడం నిజమైతే.. తన భర్త ఫోన్‌ను ట్యాపింగ్ చేశారన్న కవిత వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని కోరారు. హరీశ్‌రావు, కేటీఆర్ కళ్లల్లో భయం కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం, గొర్లస్కాం, టెలిఫోన్, కరెంట్ కొనుగోళ్లలో అవినీతి చేశారని ఆరోపించారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఎన్ని కుట్రలు చేసిన రేవంత్‌రెడ్డి సర్కార్ ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని స్పష్టం చేశారు.
వేంకటేశ్వరస్వామికి వెండి కిరీటం బహూకరణ
చందుర్తి(వేములవాడ): మండలంలోని బండపల్లి శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామికి కరీంనగర్‌కు చెందిన ముప్పిడి వీణ–హరికృష్ణ దంపతులు కిలో వెండి కిరీటాన్ని బహూకరించారు. ఆలయ అర్చకులు శ్రీకాంతాచార్యులకు శనివారం అప్పగించారు. సర్పంచ్ మల్లేశం, ఆలయ కమిటీ చైర్మన్ లక్ష్మణ్‌గౌడ్, పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు చంద్రయ్య, ఆలయ కమిటీ కోశాధికారి, మాజీ ఉపసర్పంచ్ తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.


