నిత్యం పోషకాహారం తీసుకోవాలి
● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: టీబీ పేషెంట్లు నిత్యం పోషకాహారం తీసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం టీబీ బాధితులకు పోషకాహార కిట్లు, కోడిగుడ్లను పంపిణీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ మందులు వాడుతూ.. పోషకాహారం తీసుకోవాలని సూచించారు. టీబీ నియంత్రణకు నిక్షయ మిత్ర ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ నిర్వహించాలని వైద్యాధికారులను ఆదేశించారు. 353 మందికి పోషకాహార కిట్లు పంపిణీ చేశారు. డీఎంహెచ్‌వో రజిత, ఐఎంఏ జిల్లా అధ్యక్షురాలు శోభా రాణి, సీనియర్ గైనకాలజిస్ట్ లీలాశిరీష ఉన్నారు.
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలి
గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌లో డయాస్‌ను రెవెన్యూ అధికారులు పూలతో అలంకరించాలన్నారు. ప్రజా ప్రతినిధులకు, జిల్లా అధికారులకు ఆహ్వానం పంపలని తెలిపారు. వివిధ అభివృద్ధి సంక్షేమ పథకాలతో కూడిన ప్రగతి సందేశాన్ని తయారు చేయాలని సీపీవోకు సూచించారు. వేడుకలకు వచ్చే వారికి మంచినీటిని ఏర్పాటు చేయాలని సూచించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలను ప్రతిపాదించాలని ఆదేశించారు.
పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పరిశీలన
పోలీస్ పరేడ్‌గ్రౌండ్‌ను కలెక్టర్ గరీమా అగ్రవాల్, ఎస్పీ మహేశ్ బీ గీతేతో కలిసి పరిశీలించారు. గ్రౌండ్‌లో చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, ఏవో రాంరెడ్డి, తహసీల్దార్ మహేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.


