బాధితులకు భరోసా కల్పించాలి
● విలేజ్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేయాలి ● ఎస్పీ మహేశ్ బీ గీతే
ముస్తాబాద్(సిరిసిల్ల): ఠాణాకు వచ్చే బాధితులకు భరోసా కల్పించి, న్యాయం జరిగేలా పనిచేయాలని ఎస్పీ మహేశ్ బీ గీతే సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా ముస్తాబాద్ పోలీస్‌స్టేషన్‌ను గురువారం పరిశీలించారు. పోలీస్‌స్టేషన్ ఆవరణను, ఫైలింగ్, పట్టుబడ్డ వాహనాలను, కేసుల నమోదు, దర్యాప్తు, విచారణ, కోర్టు కేసులపై సమీక్షించారు. ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో ఎవరికి ఆపద వచ్చిన ముందుగా గుర్తుకొచ్చేది పోలీసులే అన్నారు. వివిధ సమస్యలపై ఠాణాకు వచ్చే వారికి అండగా నిలిచి వారికి భరోసా కల్పించాలని సూచించారు. ఓపెన్, డ్రంకెన్‌డ్రైవ్‌లపై దృష్టి సారించి రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. గంజాయి, సారాయి వంటి వాటిని అరికట్టి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఒత్తిళ్లకు తలొగ్గకుండా పనిచేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్యవంతం చేసి, నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉంటూ నేరాలను నియంత్రించాలన్నారు. ఎస్పీ మొక్కలు నాటారు. డీఎస్పీ నాగేంద్రచారి, సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ఉన్నారు.


