మార్పు మంచిదే..
ప్రమాదాల నివారణకు ‘నో హెల్మెట్–నో పెట్రోల్’
కలెక్టర్ ఆలోచన.. ఎస్పీ ఆచరణ
పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న ఫ్లెక్సీలు
కచ్చితంగా అమలుకు పోలీసుల చర్యలు
సిరిసిల్ల: సామాజిక బాధ్యతగా చేసే మార్పు ఏదైనా మంచిదే. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని ని వారించేందుకు జిల్లా కలెక్టర్, ఎస్పీలు వినూత్నంగా ముందుకెళ్తున్నారు. రోడ్డు భద్రత జాతీయ మాసోత్సవాల్లో భాగంగా జిల్లాలో నూతన మార్పునకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆలోచన.. ఎస్పీ ఆచరణతో జిల్లాలోని పెట్రోల్‌బంక్‌ల్లో ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ ఫ్లెక్సీలను రెండు చొప్పున దర్శనమిస్తున్నాయి. అన్ని ఠాణాల ఎస్సైలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో జిల్లాలోని పెట్రోల్‌బంకుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ఆ ఫొటోలను జిల్లా పోలీస్‌బాస్‌కు పంపించారు. క్షేత్రస్థాయిలో మరోసారి పెట్రోల్‌బంక్ యజమానులకు అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పోయొద్దని స్పష్టం చేస్తున్నారు. పోలీసుల చర్యలతో స్వీయరక్షణకు బాటలు పడుతున్నాయి.
రవాణాశాఖ అధికారుల భాగస్వామ్యం
జిల్లాలో రవాణా శాఖ అధికారులు భాగస్వాములు అవుతూ.. కొత్తగా ద్విచక్రవాహనం కొనుగోలు చేసిన వారు విధిగా హెల్మెట్ కొనుగోలు చేయాలని, వాటిని వినియోగించాలని సూచిస్తున్నారు. హెల్మెట్ ఉంటేనే వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఎవరైనా వస్తే.. విధిగా హెల్మెట్ కొనాలనే నిబంధనను రవాణాశాఖ అధికారులు విధించారు. వాహనాలకు రిజిస్ట్రేషన్ లేకుండా డ్రైవింగ్‌లైసెన్స్ లేకుండా పట్టుబడితే.. జరిమానా విధించడంతోపాటు తప్పనిసరిగా హెల్మెట్‌ను కొనిపించాలని భావిస్తున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పెట్రోల్‌బంకుల్లో ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ నినాదాన్ని బహుళ ప్రాచుర్యంలోకి తేవాలని జిల్లా అధికారులు భావిస్తున్నారు.
వేములవాడరూరల్ మండలంలోని బంక్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ
నారాయణపూర్ శివారులోని పెట్రోల్‌బంక్ వద్ద పోలీసులు ఏర్పాటు చేయించిన ‘నో హెల్మెట్–నో పెట్రోల్’ ఫ్లెక్సీ
‘జిల్లాలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ లేకపోవడంతో ప్రాణాలు పోతున్నాయి. ప్రమాదాల కారణంగా అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి. జిల్లాలో గతేడాది 290 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ప్రతీ పెట్రోల్‌బంక్ యజమాని విధిగా ‘నో హెల్మెట్– నో పెట్రోల్’ ఫ్లెక్సీలు రెండు ఏర్పాటు చేయాలి. వాహనదారులను చైతన్యవంతులను చేస్తూ హెల్మెట్ ధరించేలా చూడాలి. హెల్మెట్ లేకుంటే పెట్రోల్ పోయకూడదు...’ ఇది జిల్లా ఎస్పీ మహేశ్ బీ గీతే ఈనెల 12న కలెక్టరేట్‌లో చెప్పిన మాటలు.
మార్పు మంచిదే..
మార్పు మంచిదే..


