ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదు
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడరూరల్: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని గ్రామం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గత పదేళ్లలో ఏ గ్రామానికి ఇండ్లు మంజూరు చేయలేదన్నారు. వేములవాడ మండల పరిషత్‌లో నిర్మించిన మోడల్ ఇందిరమ్మ ఇంటిని బుధవారం ప్రారంభించి మాట్లాడారు. వేములవాడ రూరల్ మండల పరిధిలోని 29 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు చూపిస్తే తాము ఓట్లు అడగబోమని.. డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు లేని ఊరు తాము చూపిస్తామని.. మీరు ఓట్లు అడగొద్దని సవాల్ విసిరారు. వేములవాడను టెంపుల్‌సిటీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశామని, పనులు వేగవంతం జరుగుతున్నాయన్నారు. తిప్పాపూర్ జంక్షన్‌కు రూ.కోటి మంజూరు చేసినట్లు తెలిపారు. ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, తహసీల్దార్ అబూబాకర్, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


